Shravan Putrada Ekadashi 2024 : వ్యాసభగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం 'పుత్రదా ఏకాదశి' వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. ఇందుకు ఆధారంగా భవిష్య పురాణంలో ఓ కథ కూడా ఉంది. పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవాడట. ఆయన రాజ్యంలోని వారంతా సిరిసంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికి, ధాన్యానికి ఆ రాజ్యంలో ఎలాంటి లోటూ లేదు. కానీ రాజు గారికి సంతానం లేకపోవడం వల్ల రాజు గారితో పాటు ప్రజలు కూడా విచారంతో ఉండేవారు. సంతానం కోసం మహిజిత్తు రాజు చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదు. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆయన కోరిక తీరలేదు.
పేరు ఎలా వచ్చిందంటే
కొద్దిరోజుల తర్వాత ఆ రాజ్యానికి దగ్గరలో లోమశుడు అనే మహర్షి ఉన్నాడని, ఆయన ఓ మహానుభావుడని తెలుసుకొని రాజు తరఫున ప్రజలంతా వెళ్లి ఏ వ్రతాన్ని ఆచరిస్తే, తమ రాజుకు పుత్రసంతానం కలుగుతుందో చెప్పమంటూ ఆ లోమశుని వేడుకున్నారు. నిష్కామంతో ఆ ప్రజలు అడుగుతున్న కోరికకు సంతసించిన లోమశుడు, శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే, రాజుకు సంతానం కలిగి తీరుతుందని చెప్పాడు. లోమశుని సూచన మేరకు రాజ దంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలు యావత్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్లుగానే రాజుగారికి పుత్ర సంతానం కలిగింది. అప్పటి నుంచి ఈ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు వచ్చింది.
పుత్రదా ఏకాదశి ఎప్పుడు
శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశిగా జరుపుకుంటాం. ఆగస్టు 15న ఉదయం 10:27 నిమిషాల నుంచి ఏకాదశి ప్రారంభమై ఆగస్టు 16న ఉదయం 09:40 వరకు ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే వ్రతాలు, పండుగలు జరుపుకోవాలి కాబట్టి ఆగస్టు 16న శుక్రవారం రోజునే పుత్రదా ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక ఏకాదశి పూజను శుక్రవారం ఉదయం 9 గంటలకు మొదలు పెట్టి 10:30 లోపు పూర్తి చేసుకోవాలి.
పుత్రదా ఏకాదశి ఆచరించే విధానం
పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు, దశమినాటి రాత్రి నుంచే ఉపవాసం ఉండాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ, తులసీదళాలతో విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు సహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలను పారాయణ చేయాలి. ఆ రాత్రి భగవంతుని కీర్తనలతో, భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగారం ఉండాలి.
ద్వాదశి పూజ
మరుసటి రోజు ద్వాదశి రోజు ఉదయం తలారా స్నానం చేసి ఇంట్లో యథావిధిగా పూజ ముగించుకుని సమీపంలోని దేవాలయానికి వెళ్లి విష్ణు దర్శనం చేయాలి. ఇంటికి వచ్చి ఒక సద్భ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి. అనంతరం ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా ఎవరైతే పుత్రదా ఏకాదశిని నియమ నిష్టలతో ఆచరిస్తారో వారికి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని శాస్త్ర వచనం.
రానున్న పుత్రదా ఏకాదశి రోజు పుత్ర సంతానం కోరుకునేవారు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించి పుత్ర సంతాన భాగ్యాన్ని పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే వినాయక క్షేత్రం- ఎక్కడుందో తెలుసా? - Ganesh Special Temple