Mahishasura Mardini Avatharam Kanaka Durga : ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరి ఏ శ్లోకం చదువుకోవాలి? ఏ రంగు వస్త్రాన్ని, ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శరన్నవరాత్రులలో తొమ్మిదవ రోజు మహర్నవమి మహా పర్వదినం. అందుకే అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. సింహవాహిని అయిన అమ్మవారు లోక కంటకుడైన మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలను కాపాడింది. అనంతరం అదే స్వరూపంతో అమ్మ కీలాద్రిపై స్వయంభువుగా వెలసింది. నవమి రోజు అమ్మవారు రాక్షస సంహారం చేసినందున ఈ రోజు మహార్నవమిగా వ్యవహరిస్తారు.
మహిషాసుర మర్దిని అవతార విశిష్టత
వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతం ప్రకారం మహిషాసురుడనే రాక్షసుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలంతా తమ శరీరాల్లోంచి మహిషాసురుడి మీద కోపంతో దివ్య తేజసుల్ని బయటకు ప్రసరింపచేస్తారు. ఆ తేజసులన్నీ కలిసి ఓ దివ్య తేజోమూర్తి ఆవిర్భవిస్తుంది. ఆ తేజో స్వరూపానికి దేవతలంతా తమ ఆయుధాలను సమర్పించగా, హిమవంతుడు తన వంతుగా సింహాన్ని ఆమెకు వాహనంగా సమర్పిస్తాడు.
సింహవాహనంపై త్రిశక్తి స్వరూపిణి
సింహవాహనంపై బయలుదేరిన ఆ శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురుడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, బాష్కలుడు, బిడాలుడు వంటి రాక్షసుల్ని అవలీలగా సంహరిస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుడిని సంహరిస్తుంది. అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద వెలిసినట్లు పురాణాలు చెబుతాయి.
భయాలను పోగొట్టి ధైర్యాన్నిచ్చే తల్లి
మహిషాసుర మర్థినీ దేవి శరన్నవరాత్రుల్లో సింహవాహనం మీద అలీఢ పద్దతుల్లో ఒక చేత త్రిశూలం ధరించి మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంతో భక్తులకు దర్శనమిస్తుంది. తలచినంతనే సమస్త భయాలను పోగొట్టి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదించే మహిషాసుర మర్ధినీ దేవిని దర్శిస్తే సకల భయాలు తొలగిపోతాయి.
శ్లోకం
"అయిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే
గిరివరవింధ్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతిహేశితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసుర మర్థిని రమ్యకపర్థిని శైలసుతే" అని అమ్మవారిని భక్తులు స్తుతిస్తారు.
ఏ రంగు వస్త్రం? ఏ పూలు?
ఈ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రం సమర్పిస్తారు. అమ్మను వివిధ రకాల పూలతో పూజించాలి.
ప్రసాదం
ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్రపొంగలి, గారెలు సమర్పించాలి. మహిషాసుర మర్ధిని దేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక! శ్రీ మాత్రే నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.