Varalakshmi Vratha Katha : సకల శుభాలను సిరిసంపదలను ఇచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్దలతో జరుపుకున్న తరువాత వ్రత కథను కూడా అంతే శ్రద్ధగా చదువుకోవాలి. అప్పుడే వ్రత ఫలం పూర్తిగా దక్కుతుంది.
వరలక్ష్మీ వ్రత కథ -సూత ఉవాచ
పూర్వం నైమిశారణ్యంలో ఉన్న శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అంటూ వరలక్ష్మీ వ్రతం గురించించి చెప్పసాగాడు.
పార్వతి ఉవాచ
ఒకసారి కైలాసంలో శివ పార్వతులు సంభాషించుకుంటూ ఉండే సమయంలో పార్వతీదేవి శివునితో 'ఓ నాధా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు ఆచరించవలసిన వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి' అని అడుగగా, అందుకు ఆ శంకరుడు ఇలా చెప్పాడు.
శంకర ఉవాచ
పార్వతి కోరిక మేరకు పరమ శివుడు 'ఓ ఉమా దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు.అప్పుడు పార్వతీదేవి ఓ దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పమని కోరింది.పరమేశ్వరుడు పార్వతి దేవికి వరలక్ష్మీ వ్రత కథను ఇలా చెప్పనారంభించాడు..పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం రత్నాలు పొదిగిన బంగారు గోడలతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలమున నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవలో తరించేది.
వరలక్ష్మీ సాక్షాత్కారం..
సుగుణశీలి అయిన చారుమతి అనుగ్రహించాలన్న సంకల్పంతో వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ! ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి, స్వప్నంలోనే ఆ వరలక్ష్మీదేవిని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగిందని పరిపరివిధాల స్తుతించింది.
నిద్ర నుంచి మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఆ పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.
శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో 'సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే'! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.
అమ్మవారిని షోడశోపచారాలతో, అష్టోత్తర శతనామాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అద్భుతం! ఆశ్చర్యం! ఆ వరలక్ష్మి దేవి అనుగ్రహంతో వారందరూ మొదటి ప్రదక్షిణ చేయగానే కాలికి స్వర్ణ రజిత అందియలు వచ్చి చేరి ఘల్లు ఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవ సాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజ తురగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. అప్పటి నుంచి వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి, సుఖ జీవనం గడిపి ముక్తిని పొందారు.
సూతమహాముని ఈ విధంగా కథను పూర్తి చేసి 'ఓ మునులారా! శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షింతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. అమ్మవారికి నివేదించిన ప్రసాదాలను బంధు మిత్రులతో కలిసి భక్తిగా ఆరగించాలి.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి? టైమింగ్ ఏంటి? నియమాలేమైనా ఉన్నాయా? - Varalakshmi Vratham 2024