YSRCP Social Media Activist Varra Ravinder Reddy: ముఖ్యమంత్రి పదవి కోల్పోయాక తొలిసారి పులివెందుల వెళ్లిన జగన్‌ను కలవడానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వారిలో పోలీసుల అదుపులో ఉన్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిన వర్రా రవీందర్‌రెడ్డి కూడా ప్రత్యక్షం అయ్యారు. వర్రా రవీందర్ రెడ్డి మూడేళ్లుగా తెలుగుదేశం ముఖ్య నేతల్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ అనేక పోస్టులు పెట్టారు.
ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌తో పాటు ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల, వివేకా కుమార్తె సునీతపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. అప్పట్లో వంగలపూడి అనిత ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ పోలీసులు, సునీత ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు, షర్మిల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు.! అవినాష్‌రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డిపై ఈగ వాలనీయకుండా గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ పెద్దలు కాపాడుకుంటూ వచ్చారు.
ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ సీఐడీ పోలీసులు వర్రా రవీందర్ రెడ్డిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అతన్ని ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతుంటే రవీందర్‌రెడ్డి మాత్రం దర్జాగా పులివెందులలోని జగన్ ఇంటి వద్ద గుండుతో ప్రత్యక్షమయ్యాడు.! శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ అక్కడే ఉన్నాడు.
వర్రా రవీందర్‌రెడ్డి అనేక సెటిల్ మెంట్లు, భూదందాలు, పంచాయితీలు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. డబ్బులు కావాలని బెదిరించడం, లేదంటే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ బ్లాక్ మెయిల్ చేస్తారనే విమర్శలున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో, కబ్జా చేసిన భూమికి మ్యుటేషన్ చేయించాలని ఓ ప్రజాప్రతినిధిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఆ ప్రజాప్రతినిధి ససేమిరా అనడంతో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టాడనే ఆరోపణలున్నాయి. నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోనూ వర్రా రవీందర్ రెడ్డి సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం.
'నేనింతే - నా తీరింతే - అసెంబ్లీకి రానంతే' - Jagan on Speaker Election Process