YSRCP Leaders Irregularities : గుడ్‌మార్నింగ్ ఈ పేరు వింటేనే అనంతపురం జిల్లాలో చొక్కాకు వైర్‌లెస్ మైకు తగిలించుకుని వీధుల్లో తిరిగే నాయకుడొకరు గుర్తొస్తారు. సమస్యలు తెలుసుకునేందుకు గల్లీల్ని చుట్టేస్తున్నట్లు పైకి కనిపించినా నిజానికి అది భూ దోపిడికి ముందస్తు రెక్కీ అని తత్వం బోధపడినవారు చెప్తుంటారు. నచ్చిన భూమిని ఎలా దక్కించుకోవాలో, ఎదురుతిరిగిన వాళ్లను ఎలా తన కాళ్లవద‌్దకు తెచ్చుకోవాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో! నాలుగున్నరేళ్లలో ఆయన అవినీతి సంపాదన గురించి ప్రత్యర్థులేకాదు సొంత పార్టీ నేతలో నోరెళ్లబెడతారు. అవినీతి సొమ్ముతో ఆయన గడిపే విలాస జీవితాన్ని చూసి తోటి ప్రజాప్రతినిధులే అసూయ పడుతారు. ఆ నాయకుడి అవినీతి పుటల్లో ప్రధానమైంది ధర్మవరం పరిధిలోని ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న ఎసైన్డ్ భూముల దోపిడీ.
Good Morning Dharmavaram : రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ ముసుగులో అనుభవదారులకు రెవెన్యూ అధికారులతో తొలుత నోటీసులు ఇప్పిస్తారు. ఆ తర్వాత అనుచరుల్ని రంగంలోకి దించుతారు! ఎలాగూ ప్రభుత్వం తీసుకునే భూములేకదా, తమకే అమ్మాలని బేరం పెడతారు. అప్పటికే బెంగపడిపోయిన యజమానులు చేసేదేమీలేక కోట్ల విలువైన భూమిని అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. అలా ఇప్పటికే 300 ఎకరాల వరకూ కొన్నారు. అవన్నీ తన తమ్ముడి కంపెనీ పేరుతో కొనుగోలు చేస్తున్నారు. ఇక భూ వివాదాలపై పంచాయితీలు పెట్టి అవీ ఆయనే లాక్కుంటున్నారు.
ధర్మవరం సమీపంలో చెరువును ఆనుకుని ఉన్న ఎర్రగుట్టపైనా ఆ నేత కన్ను పడింది. గుట్టపై ఉన్న ఎసైన్డ్ భూములను రైతులనుంచి అక్రమంగా కొన్నారు. ఓ రిటైర్డ్ ఎమ్మార్వో ద్వారా తప్పుడు పత్రాలు సృష్టించి గుట్టపై ఉన్న భూములను రైతులకు 1938లో ఎసైన్డ్ చేసినట్లు సృష్టించారు. ఆయన చెబుతున్నది నిజమే అనుకున్నా ఎర్రగుట్టపై సదరు నేత, ఆయన సంబంధీకులు కొన్నది కేవలం 25.38 ఎకరాలే. కానీ అక్కడ చెరువును కబ్జా చేసి 45.47 ఎకరాలను అనుభవిస్తున్నారు. ఆక్రమించిన 20 ఎకరాల్లో విలాసవంతమైన ఫామ్‌హౌస్, తోటలు, బోటింగ్‌వంటివి ఏర్పాటు చేసుకున్నారు.
తెలుగుదేశం హయాంలో ధర్మవరం ప్రాంతంలో సోలార్‌ప్లాంటు ఏర్పాటుకు ఎకరా మూడున్నర లక్షలు ఇచ్చి 106 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. దిల్లీకి చెందిన కంపెనీ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ భూములకూ బ్యాడ్ మార్నింగ్ మొదలైంది. సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేయనందున భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధుల్ని బెదిరించారు. ఎకరా 3 లక్షల చొప్పున 3కోట్ల18 లక్షలు వెచ్చించి 106 ఎకరాలు కొన్నారు. ముందుగా స్నేహితుడి కంపెనీ పేరుతో కొని తర్వాత తమ్ముడి కంపెనీకి బదలాయించారు. ధర్మవరం నుంచి హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని కలిపేలా నిర్మిస్తున్న రహదారి ఈ భూముల పక్కగానే వెళుతోంది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో ఆ భూముల విలువ వంద కోట్ల పైమాటేనని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు.
కేతిరెడ్డి ఆక్రమణలను గూగుల్ పట్టేసింది.. ఆధారాలు విడుదల చేసిన లోకేశ్
ధర్మవరం నియోజకవర్గంలో ఎవరికి కంకర అవసరమున్నా ఆయన వద్ద కొనాల్సిందే. ధర్మవరం పరిధిలో ఆయనో కంకర క్వారీ నిర్వహిస్తున్నారు. దాని కోసం మిగతా క్వారీలపై అక్రమ కేసులు పెట్టించి మూయించారు. వారు కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నా అధికారులతో వేధిస్తున్నారు. ముదిగుబ్బ బైపాస్ పనులు చేపడుతున్న ఓ బీజేపీ నాయకుడికి సొంతంగా క్వారీ ఉంది. ఆయన కూడా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి వద్దే కంకర కొంటున్నారు.
ఇక ధర్మవరంలో విద్యావ్యాపారమూ ఆయనదే. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అడిగినంత డబ్బు ఇవ్వలేదని ధర్మవరంలోని 4ప్రముఖ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై కక్ష కట్టారు. నిబంధనలు పాటించడం లేదంటూ నోటీసులు జారీ చేయించారు. అయినా దారికి రాకపోవడంతో అనుమతులు రద్దు చేయించి ఆ నాలుగు పాఠశాలలు పట్టణం నుంచి వెళ్లిపోయేలా చేశారు. ఆ తర్వాత ఇద్దరు అనుచరుల్ని ముందుపెట్టి కొత్తగా ప్రైవేటు పాఠశాల ప్రారంభించారు. ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు గత్యంతరం లేక అదే పాఠశాలకు వెళుతున్నారు.
ముదిగుబ్బ మండలంలోని ఉప్పలపాడు ఇసుక రీచ్‌లో ఆ నేత పాడిందే పాట! వే బిల్లులు లేకుండానే అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తితో పాటు బెంగళూరుకూ ఇసుక తరలిస్తున్నారు. తప్పుడు లెక్కలతో రోజూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్య నాయకుడికి ప్రతి నెలా రూ.కోటిన్నర ముట్టజెప్తున్నారు. ఉప్పలపాడు రీచ్‌పై ఆధిపత్యం కోసం నియోజకవర్గ కీలక నేత అప్పట్లో గట్టిగా ప్రయత్నించారు. అవి సఫలం కాకపోవడంతో అనుచరులతో గొడవలు సృష్టించి కొన్ని రోజులపాటు ఇసుక తవ్వకాలు నిలిపేయించారు.
రీచ్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్న ముఖ్య నాయకుడు ముదిగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రి మండలాలకు చెందిన నలుగురు నాయకులను ముందుపెట్టి దందా సాగిస్తున్నారు. ఆ నాయకుడి అండతో అనుచరులూ దందాలు చేసుకుంటున్నారు. ముదిగుబ్బలో రూ.60 కోట్ల విలువైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ముదిగుబ్బను ఆనుకుని ఉన్ని దొరిగల్లు పరిధిలో మూడెకరాల్ని టీడీపీ హయాంలో ముస్లిం శ్మశానవాటికకు కేటాయించారు. దాన్ని స్థానిక వైఎస్సార్సీపీ నేత కబ్జా చేసి అధికారులను బెదిరించి పాస్‌పుస్తకాలూ చేయించుకున్నారు.
ఇక దొరిగల్లులోనే 17 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని వైసీపీ నాయకులు గుల్లచేశారు. చదునుచేసి ప్లాట్లుగా మార్చి సెంటు 2 లక్షల చొప్పున అమ్మేసుకుంటున్నారు. అప్పట్లో స్థానిక తహసీల్దార్ హెచ్చరిక బోర్డులు పెట్టించినా లెక్కచేయలేదు. ముదిగుబ్బ సమీపంలో అనంతపురం-కదిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 6 ఎకరాల గుట్టను వైసీపీ నాయకులు రాత్రికిరాత్రి చదునుచేసి కంచె వేశారు. సెంటు రూ.లక్ష చొప్పున విక్రయిస్తున్నారు.
గ్రామ సౌకర్యాలపై ప్రశ్నించిన జవాన్‌పై ఎమ్మెల్యే కేతిరెడ్డి అసహనం.. వీడియో వైరల్