YSRCP Leaders irregularities in Punganur : అది చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం. 2020-21 స్థానిక సంస్థల ఎన్నికల సమయం. నామినేషన్ వేసేందుకు ముస్లిం మహిళలు వచ్చారు. ప్రజాస్వామ్య పొడ గిట్టని ముఖ్య నేత అనుచరులు రెచ్చిపోయారు. మాకు వ్యతిరేకంగా పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ బురఖాలు తొలగించారు. వాళ్ల అరాచకాలను ముందే పసిగట్టి నామినేషన్ పత్రాలు రవికల్లో పెట్టుకెళ్తే, లోపల చేయి పెట్టి మరీ వాటిని లాక్కున్నారు. మార్లపల్లెలో 80 ఏళ్ల వృద్ధుడు అంజిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. బెదిరింపులు, రాళ్ల దాడులకు లెక్కేలేదు. ఫలితం పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డులు ఏకగ్రీవం. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలూ ఏకపక్షం.
పోలింగ్ ఏజెంట్లు కిడ్నాప్ : విపక్ష నేతలు నామినేషన్ పత్రాలతో వెళ్తే లాక్కుని చించేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే అరాచకం. 3మినహా అన్నీ వైఎస్సార్సీపీ వశమే! చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంలోనూ వైఎస్సార్సీపీ మినహా ఇంకెవరూ పోటీ చేయకుండా ఎత్తుగడలు వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు కూడా సదుం మండలం బూరగమందలో పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. ఇదీ పెద్దమనిషిగా చెప్పుకుంటూ పుంగనూరు సాగించిన దౌర్జన్యం.
రామచంద్ర యాదవ్‌పై హత్యాయత్నం : ఇక పుంగనూరు మార్క్ అరాచకానికి అందరికన్నా ఎక్కువ గాయపడింది భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్రయాదవ్. పాడి, మామిడి ధరల్లో అన్యాయంపై రైతుభేరి సభ తలపెడితే 2022 డిసెంబరులో ఓ రాత్రి వందల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లు, రాడ్లతో ఆయన ఇంటిపై దండెత్తారు. ఆస్తులు ధ్వంసం చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడూ రామచంద్ర యాదవ్‌పై యర్రాతివారిపల్లెలో హత్యాయత్నం చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఠాణా వద్ద కూడా వీరంగం వేశారు.
టీడీపీ నేతపై డ్రగ్స్ కేసు : రామచంద్ర యాదవ్‌నే కాదు, పుంగనూరులో విపక్ష నేతలెవర్నీ ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి సభకు వెళ్తున్న టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా బాబుపై సోమల మండలం దళితవాడలో వైఎస్సార్సీపీ నాయకులు రాళ్లదాడి చేశారు. నంజంపేట వద్ద టీడీపీ శ్రేణుల కార్ల అద్దాలు పగలగొట్టారు. పుంగనూరులో టీడీపీ కార్యాలయానికి అద్దెకిచ్చిన భవనాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం కార్యకర్త హేమాద్రిని పుంగనూరులో కిడ్నాప్ చేసి, అతని చేతిలో డ్రగ్స్‌పెట్టి వీడియోలు తీసి కేసుల్లో ఇరికించారు.
600 మందిపై కేసులు, 200 మంది అరెస్టు : 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునూ నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా పెద్దాయన ముఠా సృష్టించిన అరాచకం అంతా ఇంతాకాదు. 2023 ఆగస్టు 4న సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై సరమభేరి మోగించేందుకు చంద్రబాబు బయలుదేరితే పుంగనూరు పట్టణంలోకి రావడానికి వీల్లేదంటూ బారికేడ్లు పెట్టించారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి చేయించారు. ప్రతిఘటించిన 600 మందిపై కేసులు పెట్టి, 200 మందిని అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్లో 'ఇతరులు'అని పేర్కొని, వైఎస్సార్సీపీ నేతలకు గిట్టని వారినెందరినో ఆ తర్వాత కేసుల్లో ఇరికించారు. 70 మందిపై రౌడీషీట్లు తెరిపించారు. చల్లా బాబును కడప జైలుకు పంపగా, దాదాపు 4 వేల మంది కార్యకర్తలు ఊళ్లు వదిలి వెళ్లిపోయేంతగా భయపెట్టారు.
ఎదిరిస్తే అంతే సంగతులు! : మైనింగ్ అక్రమాలకు అంతేలేదు. ఆ నేత కుటుంబానికి చెందిన మూడక్షరాల పేరు టిప్పర్‌పై ఉందంటే, ఎక్కడా ఎవరూ ఆపే సాహసం చేయరు. అలా ఐదేళ్లూ చిత్తూరు జిల్లాలోని వాగులు, వంకల్లోంచి వందల టిప్పర్ల ఇసుకను బెంగళూరుకు తరలించి కోట్లు కొల్లగొట్టారు. చెన్నై-బెంగళూరు హైవే నిర్మాణం కోసం కంకర అక్రమ రవాణాపై గళమెత్తిన చల్లావారిపల్లె వాసి శివకుమార్ చేతులు విరిచేసి రోడ్డు పక్కన పడేశారు.
ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సదుం మండలం బూరగమందకు చెందిన రాజారెడ్డిని 2022 ఏప్రిల్‌లో కిడ్నాప్ చేసి రెండు కాళ్లూ విరగ్గొట్టారు. నాసిరకం మద్యం గురించి ప్రశ్నించిన సోమల మండలం బండకాడ ఎస్సీ కాలనీ యువకుడు ఓంప్రతాప్ రెండు రోజుల వ్యవధిలోనే శవమైతేలాడు. పెదమండ్యంలో వీధి దీపాలు వెలగడం లేదని చెప్పిన మల్లికార్జునపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. 8 నెలల గర్భిణి అయిన మల్లికార్జున భార్య కల్యాణినీ కాలితో తన్నారు.
చంద్రబాబును ఆర్థికంగా దెబ్బ తీయాలనే కక్ష : వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ పుంగనూరులో పాడి రైతుల స్వేచ్ఛను హరించారు. తమ కుటుంబ డెయిరీకే పాలు పోయాలని సదుం, సోమల మండలాల్లో హుకుం జారీ చేయించారు. చివరకు చంద్రబాబును ఆర్థికంగా దెబ్బ తీయాలనే కక్షతో జగన్ గుజరాత్ నుంచి రప్పించిన అమూల్ సహా ఏ ఇతర డెయిరీనీ అక్కడ అడుగు పెట్టనీయలేదు. కాదని వచ్చిన వాహన డ్రైవర్లపై దాడి చేశారు. పాడి రైతులకు ఇతర డెయిరీల కన్నా లీటరుపై 3, 4 రూపాయలు తక్కువ ఇచ్చి దోచుకున్నారు. ప్రతిపక్షాల ఆందోళనతో 2023 జనవరి నుంచి ఇతర డెయిరీలను అనుమతించారు. మాడిడి రైతుల ఆదాయానికీ మోకాలడ్డారు ఆ నేత. ఆయన కుటుంబానికి సదుం మండలంలో గుజ్జు పరిశ్రమ ఉన్నందున రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన మామిడి ధరలు ఆ నియోజకవర్గంలో అమలు కానివ్వలేదు.
ఓ తాలిబన్ రాజ్యం : ఇలా ఒకటా రెండా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గాన్ని గత ఐదేళ్లూ. ఓ తాలిబన్ రాజ్యంలా మార్చుకుని చెలరేగిన పెద్ద నేత ముఠా ఆగడాల్ని పంటిబిగువన భరించిన పీడితులు ఇప్పుడు ఎన్డీఏ సర్కారు అండతో నిగ్గదీసి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపి దారుణాల చిట్టా విప్పాలని ఆకాంక్షిస్తున్నారు.
పెద్దిరెడ్డి చెరలో 236 ఎకరాలు - ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అక్రమాలు - Peddireddy Land Grabs