YSRCP Smart Meters Scam: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో జరిగిన వ్యవసాయ స్మార్ట్ మీటర్ల అక్రమాల లెక్కలు తేల్చేందుకు ఎన్టీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డిస్కంల పరిధిలో గత ఐదేళ్లలో జరిగిన బిల్లుల చెల్లింపు సామగ్రి కొనుగోళ్లపై సమగ్ర ఆడిట్ చేయించాలని భావిస్తోంది. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని 18 లక్షల 58వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, అనుబంధ పరికరాల కోసం 5వేల 692 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించి ఈ టెండర్లను జగన్ అస్మదీయ కంపెనీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుబంధ పరికరాల సరఫరా లెక్కల్లో స్పష్టత లేకుండానే గుత్తేదారుకు బిల్లుల చెల్లించి భారీ లబ్ధి చేకూర్చినట్లు ఎన్టీయే ప్రభుత్వానికి సమాచారం అందింది. అనుబంధ పరికరాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్స్‌కు రూ.1,828 కోట్లను ఎన్నికలకు కొద్ది నెలల ముందు డిస్కంలు చెల్లించినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల కోసం 2022-23లో డిస్కంలు రెండోసారి టెండరు ప్రకటన ఇచ్చాయి.
SMART METERS : మీటర్లూ అయిన వాళ్లకే.. ప్రశ్నిస్తే దాడులు.. గిట్టని వాళ్లని పనులంటూ దోపిడీ
ఇందులో గుత్తేదారు సంస్థకు అనుకూలంగా నిబంధనలను రూపొందించిందన్న ఆరోపణలు ఉన్నాయి. బిడ్ దక్కించుకున్న గుత్తేదారు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అనుబంధ పరికరాలకు 80 శాతాన్ని 14 రోజుల్లో చెల్లించేలా నిబంధన చేర్చాయి. ఆ పరికరాల సరఫరాను 14 రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి అధికారి ధ్రువీకరించాలని, ఒకవేళ ఆలస్యమైతే గుత్తేదారు సంస్థ ఇచ్చిన సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకుని బిల్లు మొత్తాన్ని చెల్లించాలని ఒప్పందంలో తెలిపాయి.
మిగిలిన 20 శాతాన్ని మీటర్లు అమర్చిన తర్వాత చెల్లించేలా నిబంధనలను గత ప్రభుత్వం రూపొందించింది. దీని ప్రకారం లక్షల సంఖ్యలో ఉన్న వ్యవసాయ రంగంలోని మోటర్లకు స్మార్ట్ మీటర్ల కనెక్షన్లకు సరఫరా చేసే మెటీరియల్‌ను అధికారులు 14 రోజుల్లోనే పరిశీలించాల్సి ఉంటుంది. వాస్తవంగా అది సాధ్యమయ్యేది కాదని తెలిసీ ఈ నిబంధన పెట్టారని భావిస్తున్నారు. అనుబంధ పరికరాల సరఫరా కోసం 2021-22లో మొదటిసారి పిలిచిన టెండర్ల ప్రకారం సరఫరా చేసిన వెంటనే 50 శాతం, మీటర్లు అమర్చిన తర్వాత 40 శాతం, రీడింగ్ నమోదు ప్రక్రియ మొదలైన తర్వాత 10 శాతాన్ని బిల్లులు చెల్లించేలా డిస్కంలు నిబంధన పెట్టాయి.
దీనివల్ల గుత్తేదారుకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది. ఈ దృష్ట్యా వారికి మేలు చేసేలా రెండోసారి పిలిచిన టెండరు నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల పథకం అమలుకు గత ప్రభుత్వం జీవో 148లో మార్గదర్శకాలు ప్రకటించింది. మీటర్లు, అనుబంధ పరికరాల కోసం 5వేల 692 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ మొత్తంలో మీటర్ల ఏర్పాటుకు రూ.3వేల 406కోట్లు, అనుబంధ పరికరాలకు రూ.2వేల 286 కోట్లు కేటాయించింది.
కేంద్రం నుంచి వచ్చే రాయితీ పోను రూ.4వేల 69 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ మేరకు బిల్లులను డిస్కంలు పంపితే ప్రభుత్వం నేరుగా చెల్లించాలి. కానీ, గుత్తేదారు సంస్థ బిల్లులు పంపడమే ఆలస్యం అన్నట్లుగా డిస్కంలు చకచకా రూ.1,828 కోట్లు చెల్లించాయి. దీనివల్ల ఆర్థికంగా డిస్కంలపై భారం పడింది.
స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ప్రభుత్వం మొండి వైఖరి - రైతులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా కనెక్షన్లు