YSRCP Leaders Anarchists in Tirumala : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలతో తిరుమలను భ్రష్టు పట్టించింది. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా దోచుకుంది. కొండపై ఐదేళ్లు వారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దల వ్యాపార, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకునే అడ్డాగా మార్చుకుంది. ఇది చాలదన్నంటూ శ్రీవారి ఆస్తులను విక్రయించడానికి వారు చేయని ప్రయత్నం లేదు. స్వామివారిపై భక్తితో దాతలు ఇచ్చిన విలువైన ఆస్తులను నిరర్థకం పేరుతో విక్రయించేందుకు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ఉన్న భూములను నిర్ధారించారు. ముందుగా తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని 23 ప్రాంతాల్లోని భూముల్ని అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో టీడీపీతోపాటు విపక్షాలు పెద్దఎత్తున ఆందోళనలు చేయడంతో దీనిపై వెనక్కి తగ్గారు. ఈ వ్యవహారం నాటి సీఎం జగన్ బాబాయి వైవీ.సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా ఉన్న కాలంలో నడిచింది.
Tirumala Srivari Properties Issue : ఆస్తుల అమ్మకానికి సంబంధించి 2020 ఫిబ్రవరి 29న బోర్డులో తీర్మానం చేశారు. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టీటీడీ ఆస్తుల విక్రయానికి ముందుగా సిద్ధమయ్యారు. ఉమ్మడి గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,అనంతపురం, కృష్ణా, విజయనగరం, కడప జిల్లాల్లోని 17 ఆస్తులను జిల్లా కలెక్టర్ల ద్వారా విక్రయించాలని అనుకున్నారు. టీటీడీకి పట్టణ ప్రాంతాల్లోనూ విలువైన ఆస్తులున్నాయి.
ఈ క్రమంలోనే గుంటూరులోని కొత్తరాముల వీధి గుడిలో ఉన్న 2,487 చదరపు అడుగుల భవనం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, అంబర్‌పేట కలాన్‌లో 1,800 చదరపు అడుగుల స్థలం, హయత్‌నగర్ పసుమాములలోని 2,250 చదరపు అడుగుల ఇంటి స్థలాన్ని విక్రయించాలనుకున్నారు. అదేవిధంగా మల్కాజిగిరి మండలం యాదవ్‌నగర్ పరిధిలోని 800 చదరపు అడుగుల ఫ్లాటును, మహారాష్ట్ర నాందేడ్‌లోని 1.48 ఎకరాలను, బెంగళూరు పరిధిలోని విలువైన ఆస్తులూ అమ్మాలని అనుకున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై, నాగపట్నం, వెల్లూరు, కోయంబత్తూరు, తిరుచ్చి, ధర్మపురి, తిరువళ్లూరుతోపాటు పలు జిల్లాల పరిధిలో నిరర్థక ఆస్తుల పేరుతో అమ్మాలని భావించారు.
టీటీడీ బృందాల ఏర్పాటుతో : ఆస్తులను వేలంలో విక్రయించేందుకు టీటీడీ రెండు బృందాలను ఏర్పాటు చేసింది. వేలంలో అత్యధిక ధరకు ఆస్తుల్ని దక్కించుకున్న వారికి రిజిస్ట్రేషన్లు చేయించే బాధ్యతా ఈ బృందాలకే అప్పగించింది. టీటీడీకి హుండీ ద్వారానే ఏడాదికి సుమారు రూ.1100 కోట్ల ఆదాయం వస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో విచ్చలవిడిగా నిధులను ఖర్చు చేశారు. 2020-21లో ఆస్తుల అమ్మకం ద్వారా రూ.100 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని బడ్జెట్‌లో పొందుపరిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయంపై నాడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. తెలుగుదేశం, జనసేన, ఇతర విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.