Visakhapatnam Constituency : విశాఖ లోక్‌సభ (Visakhapatnam Lok Sabha constituency) పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భరత్ మతుకుమిల్లిపై వైఎస్సార్సీపీకి చెందిన ఎంవీవీ (MVV) సత్యనారాయణ 4,414 ఓట్ల (0.35శాతం) స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. భరత్‌కు 34.89 శాతం ఓట్లు రాగా.. సత్యనారాయణ 35.24 శాతం ఓట్లు సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఈ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ 11 సార్లు విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 3 పర్యాయాలు, బీజేపీ, వైఎస్సార్సీపీ చెరోసారి గెలుపొందాయి.
విశాఖపట్నం లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు
- శృంగవరపుకోట
- భీమిలి
- విశాఖపట్నం తూర్పు
- విశాఖపట్నం దక్షిణ
- విశాఖపట్నం ఉత్తర
- విశాఖపట్నం పశ్చిమ
- గాజువాక
ఓటర్ల వివరాలు
- మొత్తం 18.67 లక్షల మంది ఓటర్లు
- పురుషులు 9.22 లక్షలు
- మహిళలు 9.45 లక్షల
- ట్రాన్స్‌జెండర్లు 111
![visakhapatnam_loksabha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-04-2024/21239284_visakhapatnam_loksabha.jpg)
2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున మతుకుమిల్లి భరత్ మరోసారి పోటీ చేస్తున్నారు. 29 సంవత్సరాలకే రాజకీయ రంగ ప్రవేశం చేసిన శ్రీభరత్ 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ సారి కూటమిలోని కీలక నేతలందరి నుంచి శ్రీభరత్‌కు మద్దతు లభించడంతో పార్టీ కూడా ఆయన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా నిరాశ పడకుండా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. తనదైన శైలిలో '‘డైలాగ్ విత్ భరత్'’ పేరుతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగర సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చొరవ చూపుతూ ప్రజల మన్ననలు పొందారు. ఇక వైఎస్సార్సీపీ తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ బరిలో నిలిచారు. ఉన్నత విద్యావంతురాలైన ఝాన్సీ విజయనగరం జడ్పీ చైర్‌పర్సన్‌గా, 2007లో బొబ్బిలి, 2009లో విజయనగరం ఎంపీగా పని చేశారు. ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి సినీ నిర్మాత పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పోటీ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ తరఫున కేఏ పాల్ బరిలో నిలిచారు.
లోక్‌సభ స్థానంలో గెలుపొందిన అభ్యర్థులు
- 1952 - లంకా సుందరం (స్వతంత్ర అభ్యర్థి)
- 1952 - గామ్ మల్లుదొర ( స్వతంత్ర అభ్యర్థి)
- 1957 - పూసపాటి విజయరామ గజపతిరాజు (కాంగ్రెస్)
- 1962 - మహారాజ్‌కుమార్ ఆప్ విజయనగరం (కాంగ్రెస్)
- 1967 - తెన్నేటి విశ్వనాధం (కాంగ్రెస్)
- 1971 - పూసపాటి విజయరామ గజపతిరాజు (కాంగ్రెస్)
- 1977 - ద్రోణంరాజు సత్యనారాయణ ( కాంగ్రెస్)
- 1980 - అప్పలస్వామి కొమ్మూరు (కాంగ్రెస్)
- 1984 - భట్టం శ్రీరామ మూర్తి (టీడీపీ)
- 1989 - ఉమా గజపతి రాజు (కాంగ్రెస్)
- 1991 - ఎం.వి.వి.ఎస్. మూర్తి (టీడీపీ)
- 1996 - టి. సుబ్బిరామిరెడ్డి (కాంగ్రెస్)
- 1998 - టి. సుబ్బిరామిరెడ్డి (కాంగ్రెస్)
- 1999 - ఎం.వి.వి.ఎస్. మూర్తి (టీడీపీ)
గత ఎన్నికల్లో విజేతలు - సమీప ప్రత్యర్థులు
- 2004 - ఎన్. జనార్ధన్‌రెడ్డి (కాంగ్రెస్) - ఎంవీవీఎస్ మూర్తి (టీడీపీ)
- 2009 - దగ్గుబాటి. పురందేశ్వరి (కాంగ్రెస్) - పల్లా శ్రీనివాసరావు (ప్రజారాజ్యం)
- 2014 - కంభంపాటి హరిబాబు (బీజేపీ) - వైఎస్ విజయమ్మ (వైఎస్సార్సీపీ)
- 2019 - ఎం.వి.వి.ఎస్. మూర్తి (వైఎస్సార్సీపీ) - శ్రీభరత్ మతుకుమిల్లి (టీడీపీ)