Vinod Kumar on Telangana Govt : పునర్విభజన పేరుతో జిల్లాలు మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు తలెత్తుతాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఎన్నోసార్లు చర్చలు జరిపిన తర్వాతే బాగా ఆలోచించి జిల్లాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చడం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.
Vinod Kumar on Districts Change Issue : రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగ ఖాళీలను నెల రోజుల్లో గుర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఏడాది చివరిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన వినోద్ కుమార్, ప్రొఫెసర్ కోదండరామ్‌కు బాధ్యతలు పెరిగాయని, ఆయన నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.
నన్ను, నా పార్టీని టచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు : కేసీఆర్
"గత ఎన్నికల్లో ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో తేలిపోయింది. ఎంపీ నేతకాని వెంకటేశ్ పార్టీ మారి విమర్శలు చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన నల్గొండలో సభ ఏర్పాటు చేసి తీరతాం. ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. భారీ ఎత్తున జనసమీకరణ జరుగుతోంది." - వినోద్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నేత
రాష్ట్రానికి రోజుకో నకిలీ కంపెనీ : మరోవైపు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో వినోద్ కుమార్‌తో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిలీ కంపెనీలతో ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని, దావోస్‌కు వెళ్లి అదే పని చేశారని క్రిశాంక్ మండిపడ్డారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో మెయిన్ హార్ట్ అనే సంస్థకు ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు అదే సంస్థకు రేవంత్ రెడ్డి మూసీ అభివృద్ధి పనులు అప్పగిస్తున్నారని తెలిపారు. స్కామ్ స్టార్ రేవంత్ రెడ్డి రోజుకో నకిలీ సంస్థను రాష్ట్రానికి తెస్తున్నట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
"మోసగాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ, నకిలీ కంపెనీలకు రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగిస్తున్నారు. చంద్రబాబు దారిలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టిక్కెట్ల కోసం వారసత్వ పోరు జరుగుతోంది. రేసులో వెనకపడ్డానని మైనంపల్లి అనుకుంటున్నారు. ఆయన పొర్లు దండాలు పెట్టినా కేటీఆర్, హరీశ్ రావులు అతడి వంక కూడా చూడరు. ఎన్నికల అఫిడవిట్‌లలో తన విద్యార్హతలపై మైనంపల్లి ఒక్కో సారి ఒక్కో విధమైన సమాచారం ఇచ్చారు. ఆయన ఏం చదువుకున్నారో తెలియదు. ఆయన కుమారుడు ఒక వేళ డాక్టర్ అయితే ఇలా ప్రవర్తిస్తున్న తన తండ్రికి చికిత్స చేయాలి." అని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సూచించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేవరకు మా పోరాటం కొనసాగుతుంది : నిరంజన్ రెడ్డి