Tirumala Laddu Issue : తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశం తీవ్ర కలత చెందానని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ ట్వీట్ చేయగా నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.
'డియర్ పవన్ కల్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది కాబట్టి విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోండి. దేశంలో ఇప్పటికే మతపరమైన ఉద్రిక్తతలు ఎన్నో ఉన్నాయి. తిరుపతి లడ్డూ అంశాన్ని ఎందుకు వ్యాపింపజేస్తూ జాతీయ స్థాయిలో ఊదరగొడుతున్నారు. (కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు)' అంటూ ప్రకాశ్ రాజ్ రీ ట్వీట్ చేశారు.
Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l
— Prakash Raj (@prakashraaj) September 20, 2024
ఇదిలా ఉండగా పవన్ మీడియాతో మాట్లాడుతూ "నేనే గనుక సనాతన ధర్మంపై పోరాటం చేయాలనుకుంటే నన్ను ఆపేవాళ్లే లేరు. సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తే చనిపోవడానికి కూడా సిద్ధం. కానీ అక్కడి దాకా వెళ్లదల్చుకోలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా నేను తెలియజేస్తున్నా.. సనాతన ధర్మం, లడ్డూ విషయంపై మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి.. లేదంటే మౌనంగా కూర్చోండి. అంతే తప్ప మాధ్యమాల్లో అపహాస్యం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు" అంటూ సున్నితంగా హెచ్చరించారు.
ఇక తమిళ్ హీరో కార్తి సైతం పవన్ ఆగ్రహానికి గురయ్యారు. ఓ సినిమా ఫంక్షన్ వేడుకల్లో యాంకర్ 'లడ్డు కావాలా నాయన' అనడంతో 'లడ్డు ఇప్పుడు మనకు వద్దు, అది చాలా సెన్సిటివ్ టాపిక్' అంటూ కార్తి వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 'లడ్డూ మీద జోకులా? ఓ సినిమా ఈవెంట్ ఫంక్షన్లోనూ చూశాను' అంటూ మండిపడినట్లు వీడియో బయటకు వచ్చింది. దీనిపై కార్తి స్పందిస్తూ పవన్‌కల్యాణ్‌పై తనకు ఎంతో గౌరవం ఉందని, తన వ్యాఖ్యలపై అపార్థానికి దారి తీసినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు. తాను కూడా వెంకటేశ్వరస్వామి భక్తుడినేనని, ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తానని కార్తి ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. విదేశాల్లో షూటింగ్లో ఉన్న ఆయన ఓ వీడియోను ట్వీట్ చేశారు. "శ్రీ పవన్ కళ్యాణ్ గారూ.. నేనిప్పుడే మీ ప్రెస్ మీట్ చూశాను. నేను చెప్పింది ఏంటీ, మీరు అపార్థం చేసుకొని తిప్పుతున్నది ఏంటీ? నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. ఈ నెల 30 తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెబుతా. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ ను మళ్లీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్" అని పేర్కొన్నారు.
Dear @PawanKalyan garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa
— Prakash Raj (@prakashraaj) September 24, 2024
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూల్లో ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే తల్లడిల్లిపోయానని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని నటుడు మోహన్‌బాబు తెలిపారు. ఏడు కొండల స్వామి ఆలయంలో ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం అని పేర్కొన్నారు. ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.
గోరఖ్‌పూర్ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్ సైతం తిరుపతి లడ్డూ వివాదంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోరఖ్‌నాథ్ ఆలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఉన్న వారు హిందువులు కాదన్నారు. శాస్త్రాలతో పాటు శస్త్రాలు (ఆయుధాలు) వెంట తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని, సాధువులు... యోధులుగా మారాల్సిన పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు.