Tension in YS Sharmila Election Campaign : వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండల కేంద్రంలో వైఎస్ షర్మిల న్యాయ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లింగాలకు పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు షర్మిలను చూడడానికి తరలివచ్చిన సందర్భంలో బస్సు యాత్ర అక్కడికి చేరుకుంది. ముందుగా వివేక కుమార్తె సునీత మాట్లాడుతుండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు సీఎం జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అనేక మంది వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఏమాత్రం వెనక్కి తగ్గని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా షర్మిలకు అనుకూలంగా నినాదాలు చేశారు.
దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో పోలీసులు వైసీపీ కార్యకర్తలను వారించి పక్కనే ఉన్న పార్టీ కార్యాలయం తీసుకెళ్లారు. వైసీపీ కార్యాలయంలోకి వెళ్లిన కార్యకర్తలు జెండాలు పట్టుకొని బయటికి వచ్చి మరోసారి జగన్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని షర్మిల మైకు తీసుకుని వైసీపీ కార్యకర్తలపై నిప్పులు చెరిగారు.
పులివెందులకు రండి తెల్చుకుందాం : షర్మిల మాట్లాడుతూ "అవినాష్‌రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుంది. అందుకే మా పర్యటనలు అడ్డుకుంటున్నారు. జెండాలు తొలగిస్తున్నారు. మీరు ఎంతైనా అరుచుకోండి. మాకేం అభ్యంతరం లేదు. నేను ఒకప్పుడు జగన్‌కి చెల్లెలు కాదు బిడ్డను. ఆయన సీఎం అయ్యాక జగన్‌తో నాకు పరిచయం లేదు. ఫర్వాలేదు ఆయన ఇష్టం. బాబాయిని చంపిన వాళ్లను పక్కన పెట్టుకున్నాడు. మళ్లీ వాళ్లకే టికెట్ ఇచ్చారు. ఇది ఒక కుటుంబం విషయం కాదు. ప్రజా నాయకుడు వివేకా హత్య విషయం. అవినాష్ అంటే మాకు ఇదివరకు కోపం లేదు. కానీ, అతడు హంతకుడని సీబీఐ తేల్చింది. అన్ని ఆధారాలు బయటపెట్టింది. హత్య చేసిన అతన్ని జగన్ కాపాడుతున్నారు. శిక్ష పడకుండా అడ్డుపడుతున్నారు. హంతకులకు జగన్ అండగా నిలబడినందుకే కడప ఎంపీగా పోటీ చేస్తున్నా. హంతకులు మరోసారి చట్టసభల్లోకి వెళ్లొద్దనే ఈ నిర్ణయం. న్యాయం, ధర్మం ఒకవైపు అన్యాయం, హంతకులు ఒక వైపు. అల్లరి చేసే వాళ్లు పులివెందులకు రండి పూల అంగళ్ల వద్ద పంచాయితీ పెడదాం. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం. వైఎస్సార్ లెక్క సేవ చేస్తా, మీ గొంతు దిల్లీ దాకా వినిపిస్తా" అని షర్మిల తెలిపారు.
సీఎం జగన్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడు కాదు: షర్మిల - YS Sharmila allegations on Jagan