Chandrababu fire on state government for irregularities in group1 : 2018లో జరిగిన గ్రూప్-1 పరీక్షల వాల్యూయేషన్లో అక్రమాలు జరిగాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 వాల్యూయేషన్లో అక్రమాలపై ఆధారాలను చంద్రబాబు మీడియాకు వివరించారు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి 2021 డిసెంబర్ - 2022ఫిబ్రవరి మధ్య మాన్యువల్ వాల్యుయేషన్ జరిగిందనటానికి ఆధారాలు బయట పెట్టారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు అక్రమాల్లో భాగస్వామి అని చంద్రబాబు ఆరోపించారు. వాల్యుయేషన్ ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల ఎంపిక కోసం అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆయన అందుకు తగ్గట్టుగా ఛైర్మన్ స్థాయిలో ఉన్న గౌతమ్ సవాంగ్ (Gautham Sawang) వ్యవహరించారని విమర్శించారు.
కోర్టుకు తప్పుడు అఫిడవిట్: ఇన్ని అక్రమాలకు తావిచ్చిన సవాంగ్ ఐపీఎస్‌కు అనర్హుడని చంద్రబాబు పేర్కొన్నారు. 2022 మార్చి 25 నుంచి మాన్యువల్ మూల్యంకనం జరిగినట్లు 2సార్లు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ (Affidavit) కూడా ఇచ్చారని దుయ్యబట్టారు. ఏపీపీస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారన్నారు. ఓసారి వాల్యూయేషన్ అయ్యాక రెండోసారి ఎలా చేస్తారని నిలదీశారు. సీతారామాంజనేయులే రెండోసారి వాల్యూయేషన్ జరపాలని లేఖ రాశారని, పైగా రెండోసారి వాల్యూయేషన్ చేయలేదని కోర్టులకు చెప్పారన్నారు. కోర్టులంటే కూడా భయం లేదని అన్నారు. ఏపీపీఎస్సీ పోస్టులను అమ్ముకున్నారని చంద్రబాబు ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన లిస్టులో ఉన్న వారికి పోస్టింగులు వచ్చేలా చేశారని విమర్శించారు. ఈ మేరకు మరోసారి మూడోసారి వాల్యూయేషన్ చేశారన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు చందాలు వేసుకుని న్యాయం కోసం పోరాడారన్న చంద్రబాబు ఐదేళ్ల తర్వాత వాళ్లకి న్యాయం జరిగిందని తెలిపారు.
'150 కోట్లకు గ్రూప్-1 పోస్టులు అమ్మేశారు' - వైసీపీ సర్కారుపై నిరుద్యోగుల ఆగ్రహం
క్షమించరాని నేరం : రాజకీయ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీని పునరావాస కేంద్రంగా మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర యువతను దుర్మార్గంగా దగా చేసి వారి ఆశలు చంపేశారని ఆయన మండిపడ్డారు. క్షమించరాని నేరం చేసిన దుర్మార్గుల్ని ఎం చేసినా తప్పు లేదని అన్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందంటూ చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power point presentation) ఇచ్చారు. నిరుద్యోగ యువత పట్ల క్రూర మృగాలకంటే ఘోరంగా వ్యవహరించారన్న ఆయన చేసిన నేరాన్ని తిట్టేందుకు సరైన మాటలు కూడా రానంత నీచంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ఏపీపీఎస్సీ చీకట్లు నింపిందని అన్నారు. నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్ ను మెడపెట్టి బయటకు పంపారని విమర్శించారు. ఏపీపీఎస్సీపై అవగాహన లేని అనర్హులకు ఏపీపీఎస్సీలో చోటు కల్పించారని ఆక్షేపించారు. జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్ ను చైర్మన్ గా నియమించారని మండిపడ్డారు. 2018లో విడుదలైన గ్రూప్1 ఉద్యోగాల నోటిఫికేషన్ లో అవినీతే రాజ్యమేలిందని చంద్రబాబు దుయ్యబట్టారు.
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు - ఏపీ హైకోర్టు కీలక తీర్పు
గవర్నర్ జోక్యం చేసుకోవాలి: ఏపీపీఎస్సీలో అక్రమాలు, గ్రూప్-1 అక్రమాలపై కోర్టు ఇచ్చిన తీర్పుతో తప్పు చేసిన వాళ్లు ఉరేసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కన్పించేలా అక్రమాలు చేస్తూనే బుకాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమాలు జరిగాయని తేలినా అప్పీల్ చేస్తామంటూ జగన్ అంటారా, ఇంకెంత మంది జీవితాలను నాశనం చేస్తారని దుయ్యబట్టారు. జగన్ సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. ప్రజలు వైఎస్సార్సీపీని శ్మశానానికి సాగనంపేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ సహా ఉన్న వారందర్నీ తప్పించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. సవాంగ్, పీఎస్సార్ ఆంజనేయులు (PSR Anjaneyulu) వీళ్లద్దరూ దోషులేనని చంద్రబాబు ఆరోపించారు. సవాంగ్, పీఎస్సార్ ఆంజనేయులు వద్ద నుంచి ఐపీఎస్ హోదాను వెనక్కు తీసుకోవాలని అన్నారు. జగన్, సజ్జల, పీఎస్సార్, సవాంగ్, ధనుంజయ్ రెడ్డి దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే నాశనమేనన్నారు. ఏపీపీఎస్సీ కాస్తా జేపీపీఎస్సీగా మారిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను జగన్ పార్టీ పర్సనల్ సర్వీస్ కమిషన్ లా పనిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్