TDP MLA Galla Madhavi Solving Peoples Problems While Riding a Bike : ఒక ఎమ్మెల్యే తమ నియోజకవర్గాన్ని సందర్శించినప్పుడల్లా గన్‌మెన్‌లు, వ్యక్తిగత కార్యదర్శులు, కొంతమంది నాయకులు వారి వెంట వస్తారు. అలాగే బారులు తీరిన కాన్వాయ్, సైరన్ మోతలు మారుమోగుతుంటాయి. అయితే ఇక్కడ ఓ ఎమ్మెల్యే మాత్రం ఆ విలాసాలన్నింటినీ వదులుకుని, సామాన్య వ్యక్తిగా ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు సేవ చేయాలని వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి.
ప్రజలతో మమేకం కావాలనే ఉద్దేశ్యంతో మాధవి ప్రతిరోజు తన నియోజకవర్గంలోని డివిజన్లలో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తున్నారు. ఆమె స్వయంగా టూవీలర్ నడుపుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె నియోజకవర్గంలోని 18, 19, 23, 39 డివిజన్లలో పర్యటించారు.
"నేను గ్రౌండ్ లెవెల్‌లో పర్యటించడం ప్రారంభించినప్పుడు, గత ఐదేళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి తెలిసింది. అందుకే కారులో కాకుండా ద్విచక్ర వాహనంపై డివిజనల్ పర్యటనలు చేస్తున్నా. గెలిపిస్తే ప్రజలకు సేవకురాలిగా పని చేస్తానని ఎన్నికల ముందే చెప్పా. ప్రజలు ఆశీర్వదించి సేవ చేసే భాగ్యం కల్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి నెల రోజులు కావస్తున్నా స్థానిక అధికారులు ఇంకా గాఢనిద్రలోనే ఉన్నారు. వైసీపీ మోడ్ నుంచి బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయడం ప్రారంభిస్తే బాగుంటుంది, లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చిన్న పనులు చేసేందుకూ కాంట్రాక్టర్లు మందుకు రావడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలపడానికి ఇదే ఉదాహరణ. వారి బిల్లులు సకాలంలో చెల్లిస్తామని నేను వారికి హామీ ఇచ్చాను. అప్పుడే వారు పనిని చేపట్టడానికి అంగీకరించారు" అని ఎమ్మెల్యే మధవి చెప్పారు.
'మాకు విశ్వాసం ఉంది - అందుకే ఐశ్వర్యం రొట్టె కోసం వచ్చాం' - Rottela Festival second Day