Balakrishna Election Campaign : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ అభ్యర్థులు ప్రచారం జోరును పెంచారు. ఈ తరుణంలో టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' పేరుతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. విజయనగరం జిల్లాలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై మహిళలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. టీడీపీ అభిమానులు, మహిళలు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ హూషారుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Balakrishna Swarnandhra Yatra : స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా నందమూరి బాలక్రిష్ణ, విజయనగరంజిల్లా చీపురుపల్లి, విజయనగరంలో కూటమి అభ్యర్ధులకు మద్ధతుగా రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించారు. ఆయా సభలో బాలక్రిష్ణ ప్రసంగిస్తూ, తెలుగు దేశం పార్టీ ఒక అభినవ కుటుంబం. ఆనాడు ఎన్టీఆర్ ఎన్నో సహసోపేతమైన పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. అవన్నీ అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆమోద యోగ్యమైనవని అన్నారు. నేటికీ అనేక రాజకీయ పార్టీలూ ఎన్టీఆర్ కార్యక్రమాలను అనుసరిస్తున్నారని తెలిపారు. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని బాలక్రిష్ణ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ సంక్షేమ పథకాలన్నీ కొనసాగించారని తెలిపారు. ఎంతో క్రమశిక్షణతో పార్టీని నడిపిస్తున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారని తెలియచేశారు.
తమ్ముళ్లంతా సింహాలై గర్జించాలని రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని హిందూపురం బాలకృష్ణ పిలుపునిచ్చారు. జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బాలకృష్ణ ఆరోపించారు. ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఒక పిచ్చోడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని, ఆయనకు రాష్ట్రాన్ని ఎలా పాలించాలో తెలియదని బాలకృష్ణ ఎద్దేవా చేశారు. ఉద్యోగులను సీపీఎస్ పేరుతో మోసం చేసినందుకు సిద్దమా, ఎస్సీ,ఎస్టీలను మోసం చేసినందుకు సిద్దమా, బడుగు, బలహీన వర్గాలను హత్య చేసేందుకు సిద్దమా, అక్రమాలు, ఆరాచకాలు చేసేందుకు సిద్దమా, నిరుద్యోగులు, కార్మికులకు ఉపాధి లేకుండా చేసేందుకు సిద్దమా, నకిలీ మద్యంతో మహిళల తాళిబొట్లు తెచ్చేందుకు సిద్దమా, అని జగన్‌ను ప్రశ్నించారు.
చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన మేనళ్లుడు మజ్జి శ్రీనివాసరావు, విజయనగరంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అక్రమాలపైనా, బాలక్రిష్ణ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలోని వైసీపీ నేతలందరూ ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారని, సొంతలాభం తప్ప, ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటు, పోటు ఎంత విలువైనదో జగన్‌కి మనం చాటి చెప్పాలని అన్నారు. మన కోసం, మన భావితరాల కోసం ప్రజలు సిద్దం కావాలని, మే 13న జరగనున్న ఎన్నికల్లో ఓటుని సద్వినియోగ పరచుకుని, కూటమి అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లకు బాలక్రిష్ణ సూచించారు. సభకు భారీగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.