JP Nadda Tweet on TDP And BJP Janasena Alliance : పొత్తులపై తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. మోదీ నాయకత్వంలో మూడు పార్టీలూ కలిసి పని చేస్తాయని ప్రకటనలో పేర్కొన్నాయి. దేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశాయి. దేశాభివృద్ధికి గత పదేళ్లుగా ప్రధాని మోదీ అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని ప్రకటనలో పేర్కొన్నాయి. తమ పొత్తు ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశాయి. బీజేపీ, తెలుగుదేశం మధ్య స్నేహం ఈనాటిది కాదని ప్రకటనలో పేర్కొన్నాయి.
1996లోనే తెలుగుదేశం ఎన్నికల్లో చేరిందని బీజేపీ గుర్తు చేసింది. వాజ్‌పేయి, మోదీ నేతృత్వంలో కలిసి తెలుగుదేశం విజయవంతంగా పని చేసిందని ప్రకటనలో పేర్కొన్నాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేశాయని ఆ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చిందని గుర్తు చేసింది. సీట్ల కేటాయింపు, సర్దుబాటుపై ఒకట్రెండు రోజుల్లో విధి విధానాలు ప్రకటిస్తామని బీజేపీ వెల్లడించింది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి ఏపీ ప్రజల మద్దతు కావాలని భాజపా కోరింది.
చంద్రబాబు, పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : ఎన్డీఏలో చేరాలన్న టీడీపీ, జనసేన పార్టీల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విటర్ (X) వేదికగా వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. "దేశాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల మేలు కోసం కలిసి పనిచేస్తాం" అని తెలిపారు.
మూడు పార్టీల కూటమితో ప్రజల జీవితాలకు భరోసా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలెక్కించేందుకు తెలుగుదేశం- భాజపా- జనసేన ఏకతాటిపైకి వచ్చాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేసారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత ఐదేళ్లలో చీకటి దశను ఎదుర్కొన్న రాష్ట్రానికి ఇది కీలక పరిణామమన్నారు. మూడు పార్టీల కూటమి రాష్ట్రాన్ని, ప్రజల జీవితాలను మార్చే ముఖ్యమైన మలుపు కానుందని పేర్కొన్నారు.
BJP, TDP, JSP Alliance : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఖరారైంది. దేశ వ్యాప్తంగా దాదాపు 400 స్థానాలు గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న బీజేపీ అధిష్ఠానం (BJP Supremo) ప్రాంతీయ పార్టీలతో కలిసి అడుగులు వేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే బీహార్లో నితీశ్ కుమార్, ఒడిశాలో బీజేడీ నేత నవీన్ పట్నాయక్, ఉత్తర ప్రదేశ్లో ఆర్ఎల్డీ (RLD) నేత జయంత్ చౌదరితో చర్చలు జరిపిన అధిష్ఠానం పొత్తులకు ఆహ్వానించింది. ఇక దక్షిణాదిలో టీడీపీ, జనసేన కూటమితో కలిసి పోటీకి నిర్ణయించింది.
బాబు, మోదీ మధ్యలో పవన్!- ఆ విషయంలో జనసేనాని వ్యూహాత్మక అడుగులు
టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు కుదిరిందని, కలిసి పోటీచేయాలని మూడు పార్టీలు నిర్ణయించాయని రాజ్యసభ ఎంపీ కనకమేడల (kanakamedala) రవీంద్రకుమార్ వెల్లడించారు. పార్టీల బలాబలాల మేరకు పోటీచేసే స్థానాలను త్వరలో నిర్ణయించనున్నట్లు ఆయన వెల్లడించారు. బీజేపీతో పొత్తు అధికారం కోసం కాదని, రాష్ట్రం భవిష్యత్తు కోసమేనని కనకమేడల స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాల కోసమే ఎన్డీఏలో చేరుతున్నామని వెల్లడించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తు కుదుర్చుకున్నామని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు క్రమంలో సీట్లు దక్కనివారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని ఎంపీ కనకమేడల చెప్పారు.
ఎన్డీఏలోకి చంద్రబాబు- ఏపీలో టీడీపీ,జనసేన కూటమితో జట్టుకట్టిన బీజేపీ
పొత్తు గురించి మూడు పార్టీల నేతలు కలిసి ప్రకటిస్తారని, ఉమ్మడి మ్యానిఫెస్టో, ప్రచారంపై మరో భేటీ తర్వాత నిర్ణయం ఉంటుందని కనకమేడల తెలిపారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయని, స్పష్టత వచ్చిందని, పోటీ చేసే సీట్లపై మరో సమావేశం తర్వాత తుది నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. పోటీ చేసే స్థానాలపై మా మధ్య ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా సీట్లు రానివారితో చంద్రబాబు మాట్లాడారని, సీట్లు రానివారికి ప్రభుత్వంలో, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. రాష్ట్రం బాగు కోసం పొత్తు తప్పదని చంద్రబాబు చెప్పారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే మూడు పార్టీల పొత్తు వెనుక ప్రధాన కారణని వివరించారు.
జగన్ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే లక్ష్యమని, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసమే ఎన్డీఏలో చేరుతున్నామని, గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మూడు పార్టీల నిర్ణయం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రాన్ని ఏమీ అడగలేని నిస్సహాయ స్థితిలోకి జగన్ వెళ్లారని, కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు కూడా తెచ్చుకోలేకపోయారని చెప్పారు. రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల కేంద్ర నిధులు కూడా రాలేదని, గెలుపుపై ధీమా ఉంటే తమ పొత్తుపై కంగారు ఎందుకు? అని కనకమేడల ప్రశ్నించారు. పొత్తు ఎందుకు పెట్టుకున్నామో, మా ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో కూడా చెప్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మా కూటమిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ - సీట్ల సర్దుబాటుపై కుదిరిన అవగాహన