State Cabinet Approves Land Titling Act Repeal Bill : సచివాలయంలో దాదాపు 2 గంటలకుపైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు కొత్త ఇసుక విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధివిధానాలు రూపొందించనుంది. అలాగే ఇసుక తవ్వకాల ఒప్పందాలను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు.
పౌరసరఫరాల శాఖ 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి సమ్మతి తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు NCDC నుంచి 3వేల200 కోట్ల రుణానికి ఆమోద ముద్ర వేసింది. వ్యవసాయ, సహకార కార్పొరేషన్ రుణానికి ప్రభుత్వ గ్యారెంటీకి సైతం ఆమోదం తెలిపింది. కౌలు రైతులకు సరైన ఆర్థిక సాయం అందట్లేదన్న ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారన్న మంత్రి పార్థసారథి మరింత మెరుగ్గా, సులభతరంగా రుణాలు అందించేలా చూడాలని ఆదేశించారని చెప్పారు. ఏపీ ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచానికి మార్గదర్శకంగా తయారు కావాలని సీఎం ఆకాంక్షించారని, ఆ విధంగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రానికి పరిశ్రమలు రావటానికి ఆసక్తిగా ఉన్నా వైసీపీ అనే భూతం భయం పోలేదని మంత్రివర్గం ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర అమాత్యులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అనే భూతాన్ని సీసాలో బంధించేశామనే విషయాన్ని ప్రచారం చేద్దామని మంత్రులు బదులిచ్చారు. స్వేచ్ఛగా బతుకుతున్నామనే భావనలోకి ప్రజలు వచ్చారనీ వారి అంచనాలను మన పనితీరుతో అందుకోవాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ సృష్టించే ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై మంత్రివర్గ సమావేశం ముగిశాక ఆసక్తికర చర్చ జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును ఈ అసెంబ్లీలో పెడదామని, ఇది ఎంత ప్రమాదకరమో అసెంబ్లీలో చర్చ జరగాలని సూచించారు. ప్రస్తుతం రైతుల వద్ద పాస్ పుస్తకం, టైటిల్ పుస్తకం ఉండగా ఇంకా టైటిలింగ్ చట్టం అనవసరమని అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలకు పెళ్లై పసుపు కుంకుమ కింద ఇచ్చే ఆస్తిని జిరాక్స్ కాపీలు ఇచ్చి పంపలేం కదా అని పవన్‌కళ్యాణ్ అన్నట్లు తెలిసింది. నీతి ఆయోగ్ చర్చ కోసం పెట్టిన ఓ డ్రాఫ్ట్ అడ్డం పెట్టుకుని చట్టం తెచ్చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ధాన్యం సేకరణకు వెయ్యి కోట్లు రుణం తెచ్చి పాత బకాయిలు తీర్చామని, దీనిని సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని అన్నారు. పంటల బీమాపై వెంటనే ఏం చేయగలం, లాంగ్‌టర్మ్‌లో ఏమి చేయగలమో నివేదిక రూపొందించాలని సూచించారు. 100రోజుల్లో ఏం చేశామో ప్రజలకు ప్రభుత్వ పనితీరు కనబడాలని అన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక అవసరానికి కానీ అమ్మకానికి కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మంత్రులకు ముఖ్యమంత్రి హితవు పలికారు. ఎమ్మెల్యేల జోక్యం కూడా ఉండకూడదని తేల్చిచెప్పారు. అక్రమాలు,అవినీతికి తావులేకుండా ఉచిత ఇసుక విధానం అమలు కావాలన్నారు.
ఈ నెల 22నుంచి 5రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయని వెల్లడించారు. తొలిరోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవుతాయని తర్వాత శ్వేత పత్రాలపై చర్చిద్దామని చెప్పారు. పంటల బీమా పథకం పకడ్బందీ అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతుల్ని మోసగించిందని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా 1600కోట్లు రుణం తెచ్చి వెయ్యి కోట్లు మాత్రమే రైతులకిచ్చారని, మిగిలిన 600కోట్లు ఏమయ్యాయో ఇంకా తెలియట్లేదన్నారు.
ధాన్యం సేకరణపైనా, పౌర సరఫరాల కార్పొరేషన్‌తో పాటు వ్యవసాయ శాఖ సేకరణ అంశంపైనా చర్చజరగాలని కోరారు. దీనిపై సమగ్ర వివరాలు 2రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు ఇంకా నిదానంగా ఉన్నారన్న చంద్రబాబు, క్షేత్రస్థాయి సమాచారం వేగంగా తీసుకురావడం లేదని మండిపడ్డారు. గనులు, భూకబ్జాల అంశంపై కమిటీలు వేయటమా లేక మరేం చేద్దామో నిర్ణయిద్దామన్నారు. ఏ విషయంపైనా తొందరపడి మాట్లాడొద్దని హితవుపలికారు.
కాకినాడలో ద్వారంపూడి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తండ్రి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, కొడుకు ఎమ్మెల్యే, ఇంకో కొడుకు రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఛైర్మన్ అన్న సీఎం ముగ్గురూ కలిసి బియ్యం రీసైక్లింగ్ చేసి కిలో 43 రూపాయలకు ఎగుమతి చేశారని ఆక్షేపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చే మంత్రివర్గం కల్లా ఏం చేద్దాం అనే దానిపై విధి విధానాలతో రావాలని నిర్ణయించారు.
సీనియర్ మంత్రులు సైతం నిత్య విద్యార్థుల్లా కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు. తాను ఇవాళ్టికీ కొత్త విషయాలు నేర్చుకుంటున్నానన్న చంద్రబాబు ఇంకా తనకు తెలియని అంశాలు చాలా ఉన్నాయని తెలిపారు. కొత్త వాళ్ళు మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారని సబ్జెక్ట్‌లపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారన్న ముఖ్యమంత్రి అందుకు తగ్గట్టు పనిచేయాలన్నారు. ఆగస్టు 1న ఇళ్ల వద్ద ఫించన్ పంపిణీలో పాల్గొందామని పిలుపునిచ్చారు. పింఛన్ కోసం ఏటా 35వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న సీఎం ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మనం వెళ్లి ఇవ్వటం బాగుంటుందని సహచరులకు సూచించారు.
అన్న కాంటీన్లు 100 అయినా ఆగస్టులో ప్రారంభిద్దామన్నారు. ఆర్ధిక సమస్యలెన్నో ఉన్నాయని అయినా ఇన్నోవేటివ్‌గా ఆలోచించి ముందుకెళ్దామని వివరించారు. నెల రోజుల మంత్రుల పని తీరుపైనా చర్చించారు. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్‌లో ఉందని గ్రహించి మసలుకోవాలన్న సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. HOD లతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెలనెలా సమీక్షలు చేపట్టాలని... తమ తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని మంత్రులని సీఎం ఆదేశించారు. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని మరోసారి సీఎం స్పష్టం చేశారు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని... ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలని చంద్రబాబు ఉద్బోధించారు.
వైఎస్సార్సీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం : బీజేపీ నాయకులు - BJP Leaders meeting