Sharmila criticizes CM Jagan : ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై మంగళగిరి లోని సీకే కన్వెన్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, ఏఐసీసీ అహ్వానితుడు గిడుగు రుద్రరాజు, సీనియర్ నేతలు పల్లం రాజు, జేడీ శీలం తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విభజన పూర్తి అయ్యి పదేళ్లు అయినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వలు ఏపీ కి న్యాయం చేయలేక పోయాయని నేతలు మండిపడ్డారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా పూర్తి కాకపోవడం వల్ల ఏపీ రూ.12 నుంచి 15 లక్షల కోట్ల మేర నష్ట పోయిందన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తే ఎవరూ పోరాటం చేయడం లేదన్నారు.
గుట్టల్ని కొట్టడం, పోర్టులు అమ్మడం, భూములు దోచేయడమే వైసీపీ విజన్: షర్మిల
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ పార్టీ తప్పితే పాలక, విపక్ష పార్టీలు పట్టించుకోలేదని నేతలు విమర్శించారు. అధికార పార్టీకి ఇంత మంది ఎంపీలు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఇదేమి ఖర్మ రాష్ట్రానికి, అధికార, ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి బానిసలు, ఆ పార్టీలు ప్రజలనూ ఆ పార్టీ బానిసలు గా చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఒక్క ఎంపీ సీటు గెలవక పోయినా ఏపీని బీజేపీ పాలిస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే 10 వేల పరిశ్రమలు వచ్చేవి, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో పట్టు మని 10 కూడా రాలేదన్నారు. యువత ఏపీని విడిచి పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు. అసలు ఏపీ కి రాజధాని ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి అంటే, జగన్ మూడు రాజధానులు అని అసలు ఏమీ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల వద్ద ఎంత అవమానం మనకు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓట్ల కోసం జగనన్న హామీలిస్తాడు - అమలు మాత్రం చేయడు: వైఎస్ షర్మిల
పొరుగు రాష్ట్రాలు ముందుకు వెళ్తుంటే ఏపీ 25 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. హోదా కోసం మూకుమ్మడి రాజీనామా (resignation) అన్న జగన్, అధికారంలోకి వచ్చాక అసలు దాని ఉసే ఎత్తటం లేదని దుయ్యబట్టారు. హోదా లేదు, పోలవరం లేదు, రైల్వే జోన్ (Railway Zone) లేదు, స్టీల్ ప్లాంట్ (Steel Plant) లేదు, పోర్టు లేదు, విభజన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదన్నారు. మణిపూర్ లో క్రైస్తవుల ను ఉచకోత కోస్తే జగన్ క్రైస్తవుడు అయి ఉండి ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ గా ఏపీ లో పరిస్థితి మారిందన్నారు.
చెల్లి అని చూడకుండా దూషిస్తున్నారు - జగన్పై షర్మిల ఆగ్రహం
వైసీపీ, టీడీపీ, జనసేనకు ఓట్లు వేస్తే బీజేపీలోకి వెళ్తాయని షర్మిల ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరక్క పోతే రాష్ట్రానికి హోదా రానే రాదన్నారు. ప్రత్యేక హోదా ఏపీ రాష్ట్ర హక్కు అని నేతలు వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ను నమ్మి గొర్రెల్లా మారారని ఎద్దేవా చేశారు. ఏపీని మోసం చేసిన బీజేపీ పార్టీని 420 అనాల్సిందే అని, బీజేపీ కి మద్దతు ఇస్తున్న జగన్ కూడా 420 అని ధ్వజమెత్తారు.
తల్లి లాంటి రాష్ట్రానికి హోదా విషయంలో జగన్ వెన్నుపోటు పొడిచారు. తన కుటుంబంలో తనను వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోవడంపై తట్టుకోలేకపోతున్నాను. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అంశం కానే కాదు. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసింది. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి. దాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రజలు అంతా పోరాడాలి. -షర్మిల,పీసీసీ అధ్యక్షురాలు
అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు- ఆశావహులతో షర్మిల ముఖాముఖి