RTC Buses for CM Jagan Siddham Public Meeting: ఏపీఎస్ఆర్టీసీ అధికార పార్టీ జేబు సంస్థగా మారిపోయింది. ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోకుండా వేల బస్సులను వైసీపీ సభలకు తరలిస్తోంది. పార్వతీపురం నుంచి బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల 610 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 40 బస్సులను మేదరమెట్లలో ఈ రోజు నిర్వహించే సిద్ధం సభకు తరలించారు. 570 కిలోమీటర్ల దూరంలో ఉన్నశ్రీకాకుళం నుంచి 50 బస్సులు, 470 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ నుంచి 150 బస్సులు తరలించారు. అల్లూరి జిల్లా మినహా మిగిలిన 25 జిల్లాల నుంచి బస్సులు కేటాయించింది. అత్యధికంగా నెల్లూరు జిల్లా నుంచి 360 బస్సులు, పల్నాడు నుంచి 300, ప్రకాశం నుంచి 290, ఎన్టీఆర్ జిల్లా నుంచి 270, గుంటూరు నుంచి 225, కృష్ణా నుంచి 170, బాపట్ల జిల్లా నుంచి 150 బస్సులను పంపారు.
తిరుపతి నుంచి 155 బస్సులతోపాటు రాయలసీమలోని మిగిలిన ఏడు జిల్లాల్లో కలిపి మొత్తం 985 బస్సులు కేటాయించారు. మొత్తంగా సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 3 వేల 500 బస్సులను కేటాయించి ఆర్టీసీ మరోసారి స్వామిభక్తిని ఘనంగా చాటుకుంది. రాయలసీమ జిల్లాల బస్సులు శనివారమే వెళ్లడంతో ఆయా జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి బస్సుల కొరత ఏర్పడింది. గత నెల 18న అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు 3 వేల బస్సులు పంపించి ప్రయాణికులకు నరకం చూపడంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ ఆర్టీసీ అధికారులు మాత్రం అవేవీ తమకు వినిపించలేదనట్లుగా సీఎం సేవలో తరిస్తున్నారు.
సిద్ధం సభకు 2 వేల 500 బస్సులు! - ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి - ప్రజలు ఎలా పోయినా పర్లేదా?
రాష్ట్రంలో ఆర్టీసీ సొంత, అద్దె బస్సులు కలిపి 10వేలు ఉండగా ఇందులో 3 వేల 500 సిద్ధం సభకు తరలించారు. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి మూడు బస్సుల్లో ఒకటి సీఎం సభకు వెళుతోంది. ఇవన్నీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులే. దీంతో ఎవరైనా ఇవాళ బస్సులో ప్రయాణించాలి అనుకుంటే నరకం చవిచూడాల్సిందే. చాలా గ్రామీణ ప్రాంతాలకు బస్సులు వెళ్లే అవకాశాలు లేవు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు డిపోల్లోని 70 నుంచి 80 శాతం బస్సులు సీఎం సభకు వెళ్లిపోయాయి. ఇటీవల రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు పంపిన బస్సులకే వైసీపీ పెద్దలు పూర్తిగా చెల్లింపులు చేయలేదు. ఇంకా కోటి రూపాయలకు పైగా బకాయి ఉన్నట్లు తెలిసింది.
తాజాగా మేదరమెట్ల సభకూ డబ్బులు చెల్లించకపోయినప్పటికీ, అధికారులు ఉదారంగా వ్యవహరించారు. 3 వేల 500 బస్సులకు 7 కోట్లకు పైగా అవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇందులో సగమే నేతలు చెల్లించినట్లు సమాచారం. అధికారులు అంచనా వేసిన డబ్బు మొత్తం చెల్లించే వరకూ సాధారణంగా ఎవరికీ బస్సులివ్వరు. కానీ అధికార పార్టీ నేతలు అడిగిందే తడవుగా వాళ్లు ఏయే నియోజకవర్గం నుంచి ఎన్ని బస్సులు కోరారో అక్కడి నుంచి సిద్ధం చేశారు. ఇవి సరిపోనట్టు వివిధ జిల్లాల్లోని దాదాపు 2 వేల స్కూల్ బస్సులను అధికార పార్టీ నేతలు బలవంతంగా తీసుకున్నారు. రవాణా అధికారుల ద్వారా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు ఫోన్లు చేయించి ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
అన్నొచ్చాడంటే ప్రయాణికులకు కష్టాలే
భీమిలి, దెందులూరు, రాప్తాడులలో వైసీపీ నిర్వహించిన, మేదరమెట్లలో నిర్వహిస్తున్న సిద్ధం సభలకు అడిగిన వెంటనే వేలల్లో బస్సులను ఆర్టీసీ సమకూర్చింది. ఇప్పటివరకు ప్రతిపక్ష తెలుగుదేశం ఏ సభకు బస్సులడిగినా అధికారులు కనీసం స్పందించలేదు. డబ్బులు మొత్తం ఒకేసారి చెల్లించేందుకు సిద్ధపడినా సుముఖత చూపలేదు. ఈనెల 17 లేదా 18న చిలకలూరిపేటలో తెలుగుదేశం-జనసేన భారీ సభ నిర్వహించనున్నారు. బస్సులు కేటాయించాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. అయితే తెలుగుదేశం, జనసేన సభకు అధికారులు బస్సులు కేటాయిస్తారా? లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.
పోలీసులూ సీఎం జగన్ సేవలో తరిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని సీఎం సభకు తరలించారు. దాదాపు 4 వేల 500 మంది పోలీసులు అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. నలుగురు ఎస్పీలు, 14 మంది అదనపు ఎస్పీలు, 21 మంది డీఎస్పీలు, 92 మంది సీఐలు , 292 మంది ఎస్‌ఐలు. దాదాపు 400 మంది ఎ ఆర్ ఫోర్స్, ప్రత్యేక ఫోర్స్ 160 మంది వరకూ ఉన్నారు. హెలీ ప్యాడ్ వద్ద, సభ వేదిక ప్రాంతంలో, జగన్ నడిచే ర్యాంపుకు ఇరువైపులా పెద్ద ఎత్తున సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
సిద్ధం సభ కోసం చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుంచి బొల్లాపల్లి టోల్ ప్లాజా వరకు సిద్ధం సభకు వెళ్లే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించనున్నారు. అద్దంకి నుంచి నాగులపాడు, వెంకటాపురం మీదుగా జాతీయ రహదారిపైకి ఎలాంటి వాహనాలను అనుమతించబోమని పోలీసులు తెలిపారు.
జగన్ సేవకు అంకితమైన ఆర్టీసీ- సామాన్య జనానికి చుక్కలు చూపిస్తోన్న వైఎస్సార్సీపీ