Raghurama CID Custody Allegations : వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తి చూపుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేసినందుకు, నాటి నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుపై మూడేళ్ల కిందట రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు ఆయణ్ని అప్పట్లో కస్టడీలోకి తీసుకోని చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనపై రఘురామకృష్ణరాజు ఫిర్యాదు ఆధారంగా నాటి సీఎం జగన్, అప్పటి సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్, నాటి నిఘావిభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులపై సహా పలువురిపై శుక్రవారం నాడు హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మూడేళ్ల కిందట ఏం జరిగిందనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Case Against Jagan with Raghurama Complaint : గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో రఘురామకృష్ణరాజును అధికారులు రాత్రంతా నిర్బంధించారు. ఈ క్రమంలోనే ఆయణ్ని రబ్బరు బెల్ట్, లాఠీలతో కొట్టారు. దీంతో ఆయన అరికాళ్లు రెండూ వాచిపోయాయి. జ్యుడీషియల్ రిమాండ్ కోసం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే సమయంలో రఘురామ కుంటుకుంటూ నడుస్తూ వచ్చారు. సీఐడీ కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేసి, భౌతిక దాడికి పాల్పడ్డారంటూ న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు.
అదే సమయంలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు, హైకోర్టు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లటంతో సీఐడీ అధికారులపై న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. కస్టడీలో ఉన్నవారిని ఎలా కొడతారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన శరీరంపై ఉన్న గాయాలు సీఐడీ అధికారుల దెబ్బల వల్ల అయిన గాయాలని తేలితే, తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వాన్ని ధర్మాసనం హెచ్చరించింది.
మాజీ సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు నమోదు - case file on jagan
దీనిపై వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ వైద్యుల ఆధ్వర్యంలో మెడికల్ బోర్డును హైకోర్టు ఏర్పాటు చేసింది. అయితే నాటి ప్రభుత్వాధికారులు, సీఐడీ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నివేదిక ఇచ్చింది. దీంతో రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సికింద్రాబాద్‌లోని సైనికాసుపత్రిలో మెడికల్ బోర్డు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించింది.
రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన సైనికాసుపత్రి మెడికల్ బోర్డు, ఆయనకు ఎడమకాలి రెండో వేలులో ఫ్రాక్చర్ ఉన్నట్లు తెలిపింది. రెండు పాదాల్లో వాపు ఉందని, పూర్తిగా కందిపోయాయని, ముట్టుకుంటే తీవ్ర నొప్పి వస్తోందని పేర్కొంది. ఎడమకాలిలో ఫ్రాక్చర్ ఉన్నందున దాని మడమ కదిపేటప్పుడు నొప్పి ఉన్నట్లు సుప్రీంకోర్టుకు నివేదించింది. ‘‘కుడి, ఎడమ పాదాలు, అరికాళ్లతో పాటు మడమ, పాదాల వాపు ఉంది. వేళ్లతో పాటు రెండు పాదాలు పూర్తిగా కందిపోయి రంగు మారాయి. పాదాలను ముట్టుకుంటే నొప్పి వస్తోంది. కుడిపాదం మడమపై నొప్పి ఎక్కువగా ఉంది. ఎడమపాదం రెండో వేలు చాలా నొప్పిగా ఉంది. కీళ్ల కదలికలన్నీ బాధాకరంగానే ఉన్నాయి. కాళ్లను ఎక్స్‌రే తీసి పరిశీలించినప్పుడు రెండో వేలు చివరి భాగంలో ఎముక విరిగినట్లు తేలింది.’’ అని సుప్రీంకోర్టుకు నివేదించింది.
మాజీ సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు నమోదు - case file on jagan
కస్టడీలో అనుచిత ప్రవర్తనను తోసిపుచ్చలేం : దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు, రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో అనుచిత ప్రవర్తన జరిగిందనటాన్ని తీసుపుచ్చలేమని వ్యాఖ్యానించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సైనికాసుపత్రి నివేదికలోని వైద్య పరిభాషను బట్టి అప్పట్లో ఆయణ్ని కస్టడీలో తీవ్రంగా కొట్టారనేది స్పష్టమైంది.
రఘురామపై రాజద్రోహం కేసు : నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు పదునైన విమర్శలు చేస్తుండటంతో, ఆయనపై 2021 మే నెలలో సీఐడీ అధికారులు రాజద్రోహం కేసు పెట్టారు. కుల మతాలకు వ్యతిరేకంగా రఘురామ విద్వేషాలు రెచ్చగొట్టారని, ప్రజా సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ కేసు నమోదు చేశారు. రఘురామ వ్యాఖ్యలను ప్రసారం చేశారంటూ ఏబీఎన్, టీవీ5 ఛానెళ్లను కూడా నిందితులుగా చేర్చారు.
రాజద్రోహం కేసు - హైదరాబాద్‌లో అరెస్ట్ : 2021 మే 14న రఘురామకృష్ణరాజు పుట్టిన రోజు. ఆ రోజు సాయంత్రం 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన, ఏపీ సీఐడీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. వై కేటగిరి భద్రతలో ఉన్న నిబంధనలన్నీ ఉల్లంఘించి ఆయణ్ని అరెస్టు చేశారు. వాహనంలో ఎక్కించుకుని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయాని,కి రాత్రి 9:50 గంటల సమయంలో తీసుకొచ్చారు. ఆ రాత్రంతా అక్కడే నిర్బంధించారు. అప్పటికి రఘురామ గుండెకు శస్త్ర చికిత్స జరిగి మూడు నెలలైంది.
రాత్రంతా నిర్బంధించి - రబ్బరు బెల్ట్, లాఠీలతో కొట్టి : గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో రఘురామకృష్ణరాజును నిర్బంధించిన సీఐడీ అధికారులు, ఆయణ్ని చిత్రహింసలకు గురిచేశారు. కస్టడీలో ఉన్నప్పుడు సీఐడీ అధికారులు తనను రబ్బరు బెల్ట్, కర్రలతో కొట్టారని రఘురామ అప్పట్లో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలమిచ్చారు. అంతేకాక థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, రాత్రి 11 గంటల 11:15 గంటల మధ్య గదిలోకి ఐదుగురు వ్యక్తులు ప్రవేశించారని చెప్పారు. వారి ముఖాలకు రుమాళ్లు కట్టుకుని ఉన్నారని వివరించారు. తన కాళ్లను వారు కట్టేశారని, ఐదుగురిలో ఒకరు కర్రతో తనను కొట్టారని చెప్పారు. మరకొరు రబ్బరు స్టిక్‌తో అరికాళ్లపై కొట్టినట్లు వివరించారు. ఆ తర్వాత నేలపై నడవాలని ఆదేశించారని, అలా నడిచాక మళ్లీ కొట్టారని, ఇలా నడవలేనంత వరకూ నాలుగైదు సార్లు కొట్టినట్లు రఘురామ వాంగ్మూలంలో వెల్లడించారు.
గుండెలపై కూర్చొని - ఊపిరాడనివ్వకుండా చేసి : 2020 డిసెంబర్లో రఘురామకృష్ణరాజు గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అది తెలిసి కూడా, సీఐడీ కస్టడీలో కొందరు వ్యక్తులు తన గుండెలపై కూర్చొని ఊపిరాడనివ్వకుండా చేశారని రఘురామ అప్పట్లో ఆరోపించారు. కనీసం మందులు వేసుకునేందుకు కూడా అవకాశమివ్వకుండా చంపాలని చూశారంటూ న్యాయస్థానం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. తన ఫోన్ తీసుకుని దాని పాస్‌వర్డ్ చెప్పేంతవరకూ కొట్టారని పేర్కొన్నారు. పీవీ సునీల్‌కుమార్ అయితే తనను చంపేస్తానని బెదిరించారుని, రఘురామకృష్ణరాజు అప్పట్లో వెల్లడించారు. ఆ ఘటనపైనే మూడేళ్ల తర్వాత తాజాగా కేసు నమోదైంది.
'అదే నాకు చివరి రోజు అవుతుందనుకున్నా'- నాటి భయానక అనుభవంపై రఘురామ - RRR Interview