PM Modi AP Tour Schedule: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కలిసి భారీ బహిరంగ సభల్లో, ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రధాని రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి సభ ప్రాంగణం వేమగిరి వద్దకు జాతీయ రహదారి 16 గుండా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ వద్ద మధ్యాహ్నం 3.30 చేరుకోనున్నారు. పార్టీ నేతలతో కలసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అనంతరం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు మోదీ చేరుకోనున్నారు. 5 గంటల 55 నిమిషాలకు సాన్ యూఫోరియా లేఅవుట్, ఊగిని పాలెం పంచాయతీ, కసిమికోట మండలం మీదుగా అనకాపల్లి చేరుకొని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, ఎన్డీఏ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు.
ఈ నెల 8వ తేదీన పీలేరు సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పీలేరు అసెంబ్లీ పరిధిలో కలికిరి సభా ప్రాంగణం వద్దకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోనున్నారు. టీడీపీ, జనసేన బలపరిచిన రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులతో కలసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అనంతరం బుధవారం సాయంత్రం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో లో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని చేరుకోనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకొని ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని కాంక్షించి రోడ్ షోలో పాల్గొంటారు.
రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలి: నందమూరి బాలకృష్ణ - Balakrishna Election Campaign