Pawan Kalyan Varahi Declaration: తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద పవన్ కల్యాణ్ వారాహి బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ అంశాలు పవన్ వివరించారు. ఈరోజు వారాహి సభ ప్రత్యేకమైనదని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిందని, ఈ 100 రోజుల్లో ఎప్పుడూ బయటకు రాలేదని తెలిపారు. ప్రజలకు ఇచ్చి హామీలను ఎలా అమలు చేయాలి, రాష్ట్రాభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచించామన్నారు. ఆంధ్రప్రదేశ్ బలం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉందని, ఏడుకొండలవాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ధ్వజమెత్తారు. అన్ని ఓట్ల కోసమే చేయమని అన్నారు. తన జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని అనుకోలేదన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు.
వారితో గొడవ పెట్టుకోవడానికి వచ్చా: తనకు అన్యాయం జరిగితే బయటకు రాలేదని, తిరుమలలో అపచారం జరుగుతుంది సరిదిద్దుకొండి అని గతంలో చెప్పానన్నారు. తిరుమలలో కల్తీ ప్రసాదాలు పెట్టారని మండిపడ్డారు. ఇది ఎన్నికల సమయం కాదని, సినిమా సమయం కాదని, ఇది భగవంతుడి సమయమని స్పష్టం చేశారు. ఇతర మతాలను చూసి నేర్చుకోవాలన్న పవన్, హైందవ ధర్మానానికి మనం గౌరవం ఇవ్వట్లేదని అన్నారు. మీతో జైజైలు కొట్టించుకోవడానికి రాలేదని, మీతో గొడవ పెట్టుకోవడానికి వచ్చానన్నారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని ఎవరు అన్నారో వారితో గొడవ పెట్టుకోవడానికి వచ్చానని తేల్చి చెప్పారు. ఒక డిప్యూటీ సీఎంగానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడికి రాలేదన్న పవన్, హిందువుగా, భారతీయుడిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు.
వారాహి డిక్లరేషన్: సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బలమైన చట్టం అవసరం. దేశమంతా అమలయ్యేలా వెంటనే ఒక చట్టం తేవాలి. చట్టం అమలుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ఏటా నిధులు కేటాయించాలి. ప్రసాదాల్లో వాడే వస్తువుల నాణ్యతను ధ్రువీకరించే విధానం తేవాలి. మన దేవాలయాలు విద్య, కళలు, ఆర్థిక కేంద్రాలుగా విలసిల్లాయి. మన ఆలయాలు పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా మారాలని పవన్ తెలిపారు.
హిందువుగా సనాతన ధర్మాన్ని తాను ఆరాధిస్తానని, మిగతా మతాలను గౌరవిస్తానని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం చూపేది, ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని పవన్ తెలిపారు. సనాతన ధర్మం మనుషులు ఒక్కరే సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకోలేదని, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకుంటుందని వెల్లడించారు. ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు అని, కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వేంకటేశ్వరస్వామి పేర్కొన్నారు.
వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా: తాను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేలన చేసి మాట్లాడారని, తన ప్రాయశ్చిత్త దీక్షను కూడా అవహేలన చేశారని అన్నారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానన్న పవన్, ఇనాళ్లు తాను ధర్మం పట్టుకుని నిలబడ్డానన్నారు. నమాజ్ వినిపిస్తే తన ప్రసంగాన్ని ఆపేసేవాడినని గుర్తు చేశారు. పరాభవం పొందినా, పరాజయం పొందినా తాను ఒకేలా ఉంటానన్నారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంతమంది అంటున్నారని, ఈ మధ్య కాలంలో దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయని అన్నారు. రాముడిని తిడితే నోరెత్తకూడదని, మనది సెక్యులర్ దేశం అంటారని, ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా అని ప్రశ్నించారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదా అని నిలదీశారు.
హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చింది: సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారన్న పవన్, సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించేవారు ఎక్కువయ్యారని, ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవని ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్ ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా ఎవరూ మాట్లాడరని, మనం పళ్ల బిగువున బాధను భరించాలా అని ధ్వజమెత్తారు. మన సమాజంలో ఐక్యత లేకపోవడమే దీనికి కారణమన్న పవన్, హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారన్నారు. హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందన్న పవన్, మన మతం గురించి మాట్లాడుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదని, మెకాలే తీసుకువచ్చిన వివక్ష ఇదంతా అని పేర్కొన్నారు.
అదీ సనాతన ధర్మం గొప్పతనం: సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని పవన్ హెచ్చరించారు. సనాతన ధర్మం పేరుతో మనం జీవం కోల్పోయామని, ధైర్యం, వీరత్వమే సమాజ వికాసానికి మూలమన్నారు. ఈసారి ఎన్నికలు వస్తే వారిని 11 నుంచి ఒక సీటుకు పరిమితం చేద్దామని పిలుపునిచ్చారు. తనకు నచ్చిన హిందీ కవి రామ్‌ధారీసింగ్ దినకర్ అని తెలిపిన పవన్, ఆయన రాసిన పరశురామ్ కీ ప్రతీక్షా తనకు నచ్చిన పుస్తకమని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని మతాలను కలుపుకుని వెళ్లడమని, మన పాలకులు మసీదులు, చర్చిలు కట్టించారని, అదీ సనాతన ధర్మం గొప్పదనమన్నారు.
తప్పులు జరుగుతుంటే ఎన్నాళ్లు ఊరుకుంటాం: సనాతన ధర్మంపై దాడి జరిగితే ఒక్కరూ మాట్లాడరని, మిగతా మతాలపై దాడి జరిగితే ప్రముఖులంతా మాట్లాడతారని మండిపడ్డారు. హిందూ సమాజంపై దాడి తప్పని తెలిసి కూడా మాట్లాడరని, తప్పులు జరుగుతుంటే ఎన్నాళ్లు ఊరుకుంటామని ధ్వజమెత్తారు. సనాతన ధర్మంపై దాడి జరిగితే మౌనంగా ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అన్ని మతాలు పరస్పరం గౌరవించుకోవడమే లౌకికవాదానికి అసలైన అర్థమని, మా ఆవేదన, బాధ, ఇబ్బందులు మాత్రమే చెబుతున్నామన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రాంతాలకు అతీతంగా ఒకే గళం వినిపించాలన్న పవన్, పార్టీలు, భాషలకు అతీతంగా సనాతన ధర్మం గొంతు వినిపించాలన్నారు.
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి: మన దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, విద్య, సంస్కృతి, సంపదకు మూలస్తంభాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ దేశమంతా అమలయ్యేలా బలమైన చట్టం తేవాలని, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, దానికి నిధులు ఇవ్వాలన్నారు. నైవేద్యాలు, ప్రసాదాల్లో వాడే వస్తువుల స్వచ్ఛతను పరీక్షించాలన్న పవన్, తిరుమలలో నిబంధనల ఉల్లంఘనపైనే తమ ఆవేదన అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్నామని, వైవీ సుబ్బారెడ్డి హయాంలో రూ.10 వేలు తీసుకుని రూ.500 రిసీట్ ఇచ్చేవారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన దాంట్లో లడ్డూ ప్రసాదం కల్తీ అనేది చిన్న విషయమని పేర్కొన్నారు.
మీరు చేసిన పాపాలు ఆ స్వామివారే చెబుతారు: గుమ్మడికాయల దొంగ అంటే వారు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. దర్యాప్తు చేయాలని కోరితే రాజకీయాలు చేస్తున్నామని అంటున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు వైఖరిపైనే తమ ఆరోపణలు అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీల రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే తిట్టే రకం మీరని, వాళ్లు చేసిన పాపాలు ఏమిటో ఆ స్వామివారే చెబుతారన్నారు. స్వామివారి నిజరూప దర్శనం జరిగినప్పుడు మీకు తెలుస్తుందని, పాత ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారని, ఎందుకు మాట్లాడరని నిలదీశారు. సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి ఎందుకు స్పందించరని పవన్ ప్రశ్నించారు. ఆచారాలు పాటించని మీరు టీటీడీ బోర్డులో ఎందుకున్నారని పవన్ ధ్వజమెత్తారు.
ఎవరైనా మాడి మసైపోతారు: ఆలయాలపై దాడులు చేసిన వారిపై మీరు తీసుకున్న చర్యలు ఏమిటని వైఎస్సార్సీని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అనేక అన్యాయాలు చేసిందన్న పవన్ కల్యాణ్, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా మీరు దూషించారన్నారు. పార్టీ రంగులు వేసేందుకు రూ.2,005 కోట్లు ఖర్చు పెట్టారని, సనాతన ధర్మాన్ని ముట్టుకున్నవారు ఎవరైనా మాడి మసైపోతారని పవన్ హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయడం ఎప్పటికీ సాధ్యం కాదని, సనాతన ధర్మాన్ని నాశనం చేయడం హిమాద్రిని తుపాకీతో పేల్చడం లాంటిదని తెలిపారు. ఎందరు రాక్షసులు అడ్డుపడినా సనాతన ధర్మానికి ఏమీకాదని, సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఇతర మతాలను గౌరవిద్దామని, సనాతన ధర్మంపై దాడి జరిగినా, అపహాస్యం చేసినా తిరగబడదామన్నారు. సనాతన ధర్మాన్ని దూషిస్తే ప్రాణాలు ఒడ్డయినా రక్షించుకుందామని పేర్కొన్నారు.
తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కుమార్తె పొలెనా అంజన - Pawan Kalyan Daughter Declaration