Pawan Kalyan Bike Number Plate Trending in Pithapuram : 'నేను ట్రెండ్ ఫాలో అవను - ట్రెండ్ సెట్ చేస్తా' పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలోని ఈ పవర్ ఫుల్ డైలాగులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి. ఇక రాజకీయాల్లోనూ పవన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. 'నా నాలుగో భార్యవు నువ్వే - రా వచ్చెయ్' అంటూ సీఎం జగన్ తనపై చేసిన విమర్శలకు పవన్ కల్యాణ్ ఇచ్చిన కౌంటర్ ఎటాక్ 'నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్' అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోను ఆదర్శంగా తీసుకున్న పవన్ అభిమానులు సైతం పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ చేశారు. అది ఇప్పుడు పిఠాపురంలో మొదలై ఇప్పుడు రాష్ట్రమంతా ట్రెండింగ్‌లో ఉంది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చాటుతున్నా నేపథ్యంలో జనసైనికులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ బోర్డులు తయారు చేయిస్తున్నారు. వాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో ఈ నేం బోర్డును తగిలిస్తున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ తప్పకుండా గెలుస్తారనే విశ్వాసంతో పోస్టులు పెడుతున్నారు. పవన్ ను ముందుగానే ఎమ్మెల్యే చేసేసిన జనసైనికులు పనిలో పనిగా వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి జగన్ కు తమదైన శైలిలో పంచ్ లు ఇస్తున్నారు.
సినిమా హిట్టా? ఫట్టా! అనే విషయం పవన్ కల్యాణ్ క్రేజ్‌ను ఏ మాత్రం ప్రభావితం చేయలేవు. జనసేన పార్టీ అధినేతగా రాజకీయాల్లోనూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ అలాగే కొనసాగుతోంది. తమ అభిమానాన్ని చాటుకునే క్రమంలో ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అందుకే ఇలాంటి కొత్త తరహా ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ ఫొటోలు, జనసేన జెండాలు, గాజు గ్లాస్ స్టిక్కర్లు తమ వాహనాలపై అతికించిన వారు పోలింగ్ తర్వాత ట్రెండ్ మార్చారు. బైక్‌ల వెనక నెంబర్ ప్లేట్ల్ స్థానంలో 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా', 'పిఠాపురం ఎమ్మెల్యే తమ్ముడు' అనే స్టిక్కర్లతో కూడిన వాహనాలు ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేం బోర్డుల ప్రచారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఫలితాలు వచ్చే నాటికి ఇంకెన్ని మలుపులు వస్తాయో మరి.
రాజోలులో ఓ జనసైనికుడు నంబర్ ప్లేట్ స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బోర్డు పెట్టాడు. ఇది సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. ఆ వెంటనే మిగతా జనసైనికులు దీన్నో ప్రచారంగా మార్చివేశారు. నేం బోర్డులు తయారు చేయించుకుని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. దీనికి పిఠాపురం వైసీపీ కార్యకర్తలు కౌంటగ్ గా వంగా గీత, డిప్యూటి సీఎం, ఏపీ సీం గారి తమ్ముడు అంటూ బోర్డులను వదిలారు. చిర్రెత్తిన జనసైనికులు బాబాయిని లేపినోడి తాలూకా, బాబాయిని లేపేసినోడి తాలూకా, పవనన్న నాలుగో పెళ్లాం తాలూకా అంటూ కొత్త బోర్డులతో ఎదురుదాడికి దిగారు. ఈ వార్ ఇలా కొనసాగుతుండగా పసుపు సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ టీడీపీ నేతల పేర్లతో బోర్డులు రూపొందించారు. గుంటూరు ఎంపీ గారి తాలూకా, తాడికొండ ఎమ్మెల్యే తాలూకా, ఎమ్మెల్యే యరపతినేని తాలూకా, పొన్నూరు ఎమ్మెల్యే తమ్ముడు అంటూ ఎవరికివారు నేం బోర్డులు తయారు చేయించారు.
వాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో వచ్చిన మార్పులను ఆర్టీఏ అధికారులు కూడా గమనిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక చూసుకుందాం అనుకుంటున్నారో ఏమో! చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
అన్నయ్య, అబ్బాయి, అల్లుడు - పవన్‌కు మద్దతుగా మెగా కుటుంబం - Allu Arjun Sends Wishes To Pawan