No Response from People to CM Jagan Bus Yatra: సీఎం జగన్ బస్సు యాత్ర జనానికి తీవ్ర అవస్థలు కలిగిస్తోంది. పరీక్షలకు, ఆసుపత్రులకు వెళ్లే జనాల వాహనాలను ఆపేయడంతో వారంతా తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పోలీసులు తీరుపైనా జనం మండిపడ్డారు.
బస్సు యాత్రకి జనాదరణ కరువు: తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం శివారు నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రంగంపేట మండలం వడిసలేరు చేరుకునేసరికి సీఎం జగన్ బస్సు యాత్రకి జనాదరణ కరువైంది. ఈ యాత్రలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వచ్చిన ఆ కొంత మంది ప్రజలు ఎండలో అవస్థలు పడ్డారు. సీఎం జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలను పోలీసులు నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
పోలీసుల తీరుతో ప్రజలకు ఇబ్బందులు: కాకినాడ జిల్లాలో సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పర్యటన వేళ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ సామర్లకోట, పెద్దాపురంలో ఎక్కడికక్కడే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పెద్దాపురంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ప్రధాన రహదారుల్లో వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుతో ఆస్పత్రులకు వెళ్లే రోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులను గంటల తరబడి ఎండలోనే ఉన్నారు. వాహనాలు వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన ప్రయాణికులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. విద్యార్థులకు పరీక్షలు అవుతున్నాయి కాలేజ్‌కు తీసుకెళ్లడానికి దారి ఇవ్వాలంటూ అడిగిన ఆటో డ్రైవర్‌ను ఓ కానిస్టేబుల్ పక్కకు నెట్టేశారు.
బలవంతంగా తరలింపు: సీఎం జగన్ సభలకు, దారి పొడువునా ప్రజలను పోగు చేయడానికి వైసీపీ నాయకులు నానా అవస్థలు పడుతున్నారు. జగన్ బహిరంగ సభలకు జనాన్ని పార్టీ శ్రేణులు బలవంతంగా తరలిస్తుంటే, మరికొంత మంది డబ్బు, మద్యం ఆశ చూపి జనాన్ని పోగు చేస్తున్నారు. ఇంకా కొందరు అయితే జగన్ సభలకు రాని వారిపై దాడులు కూడా చేస్తున్నారు. జగన్ జిల్లాలో పర్యటిస్తున్నారు అంటేనే స్థానికులు భయపడుతున్నారు.