MP Arvind Comments CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ రైతులను నమ్మించి మోసం చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో సీట్లు రాలేదని, అందుకే ఇక్కడ పేదల ఇళ్లు కూలుస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే నోటీసు లేదని, నేరుగా కూలుస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ రైతు హామీల సాధన కోసం బీజేపీ ప్రజా ప్రతినిధులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. రేపు ఉదయం పదకొండు గంటల వరకు జరిగే దీక్షను బీజేపీ కర్ణాటక రాష్ట్ర సహా ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎంపీ అర్వింద్ మాట్లాడారు.
రైతు రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా లేదని, బోనస్ ముచ్చట కూడా లేదని దుయ్యబట్టారు. ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేడని వ్యాఖ్యానించారు. మహేశ్వర్ రెడ్డి ఎల్పీ నేత అయినప్పటి నుంచి ఎన్నో స్కాములు, అవినీతిని బట్టబయలు చేశారని కొనియాడారు. కేసీఆర్ తెలంగాణను నట్టేట ముంచారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అగ్రికల్చర్ పాలసీ కూడా లేదని ఆక్షేపించారు. అందరూ ఇలాగే కలిసి కట్టుగా బలమైన అపోజిషన్‌గా వెళ్తే, వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని వ్యాఖ్యానించారు.
'కేసీఆర్ తెలంగాణను నట్టేట ముంచారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు అగ్రికల్చర్ పాలసీ కూడా లేదు. రైతు భరోసా కాదు బీమా కూడా అందడంలేదు. మనమంతా ఇలాగే కలిసి కట్టుగా బలమైన అపొజిషన్‌గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే'- అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
రైతులకు అండగా ఉంటూ కాంగ్రెస్ మెడలు వంచుతాం : ఇచ్చిన హామీలు మరిచావా? మరిచిపోయినట్లు నటిస్తున్నావా అని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డినీ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. రైతులు ఓట్లేస్తే కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. రైతులకు అండగా తాముంటామని, కాంగ్రెస్ మెడలు వంచుతామని హెచ్చరించారు. అన్నదాతలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపీలు ఈటల రాజేందర్, డీకే. అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అర్వంద్, గోడెం నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వాయి హరీష్ బాబు దీక్షలో కూర్చున్నారు.
నేడు ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ 'రైతు హామీల సాధన' దీక్ష