NDA Leaders Complaint to Election Commission: ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం ఉందని ఎన్డీఏ నేతలు ఆరోపించారు. ఈ మేరకు కూటమి నేతలు వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, బి.రామకృష్ణలు సీఈవోకు ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి వ్యవహరశైలిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
పల్నాడు జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం సభలో పోలీసుల తీరుపై ఎన్డీఏ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహార శైలితో సభలో చాలా ఇబ్బందులు తలెత్తాయని మండిపడ్డారు. సభ నిర్వహణలో పోలీసులు సహకరించలేదని, వారి వైఫల్యం వల్లే విపరీతంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడిందని ఆరోపించారు.
ప్రధాని సభలోనూ పోలీసుల నిర్లక్ష్యం - అడుగడుగునా వైఫల్యం
ప్రజాగళం సభ నిర్వహాణ గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) తెలిపారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈ నెల 12నే డీజీపీకి లేఖ రాశామని, నిన్నటి సభలో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించలేదని వర్ల ఆరోపించారు. సభకు వచ్చేవారిని రెండు కిలోమీటర్ల ముందే ఆపివేయడంతో సభకు వచ్చే వారు ఇబ్బందులు పడేలా చేశారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తగా పల్నాడు ఎస్పీ పనిచేయడంతోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ప్రజాగళం సభను భగ్నం చేసేందుకు పల్నాడు ఎస్పీ, ఇంటెలిజెన్స్ డీజీ ప్రయత్నించారని ఆరోపించారు. ప్రధాని ప్రసంగించే సభలో మైక్ డిస్టర్బ్ కావడమా! అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. నలుగురు అధికారులపై ఆధారాలతో సీఈవోకు ఫిర్యాదు చేశామని, తగిన విచారణ జరిపి బాధ్యులైన వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరామన్నారు.
సభకు వచ్చిన చాలామంది రోడ్లపైనే ఉండిపోయారని బీజేపీ నేత పాతూరి నాగభూషణం తెలిపారు. బొకేలు, శాలువాలు తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని, వ్యక్తులు, పార్టీలకు పోలీసు అధికారులు కొమ్ముకాయడం సరికాదని హితవు పలికారు. సభలో పోలీసుల తీరుపై పీఎంవోకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఎన్‌ఎస్‌జీ అధికారులు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని బి.రామకృష్ణ మండిపడ్డారు. మైకుల వద్దకు జనం రాకుండా చూసే బాధ్యత పోలీసులదే అని పేర్కొన్నారు.
"నిన్నటి సభను భగ్నం చేసేందుకు పల్నాడు ఎస్పీ శాయశక్తులా ప్రయత్నించారు. సభను భగ్నం చేసేందుకు ఇంటెలిజెన్స్ డీజీ కూడా ప్రయత్నించారు. ప్రధాని ప్రసంగించే సభలో మైక్ డిస్టర్బ్ అయితే అది పోలీసుల వైఫల్యం కాదా. అందుకే మేమంతా ఆధారాలతో సహా సీఈవోని కలిశాం. నలుగురు అధికారులను విధుల నుంచి వెంటనే తొలగించాలి". - వర్ల రామయ్య, టీడీపీ నేత
ప్రజాగళంలో సభలో పోలీసుల వైఫల్యం - ప్రధాని ప్రసంగానికి పలుమార్లు ఆటంకం
TDP Leader Dhulipala Narendra on Police Failures: ప్రజాగళం సభ నిర్వహణలో పోలీసులు సహకరించలేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. పోలీసుల వైఫల్యం వల్ల విపరీతంగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడిందన్నారు. ప్రధాని మోదీ పాల్గొన్న సభలో క్రౌడ్ మేనేజ్‌మెంట్ బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. ఎందుకంత నిర్లక్ష్యంగా వహించారని పోలీసు అధికారులను ఆయన నిలదీశారు. సభ పర్యవేక్షించిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.