Nara Bhuvaneswari Nijam Gelavali : చంద్రబాబుకు మత్స్యరంగంపై ఉన్న శ్రద్ధ, కృషి వల్ల ఎన్నో సంక్షేమ పథకాలు వారికి అందాయని ఆయన సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. 23వ వార్డులో పార్టీ కార్యకర్త మట్టా సోమయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. గుడ్ ఫ్రైడే (Good Friday) సందర్భంగా చర్చిలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నోబుల్ ప్యారిష్ చర్చి దైవసేవకులు గుడ్ ఫ్రైడే ఆశీస్సులు అందించారు. అనంతరం మచిలీపట్నంలో గంగపుత్రుల కుటుంబాలతో మాటామంతి నిర్వహించారు. చంద్రబాబు కృషి వల్ల దేశంలోనే చేపల ఉత్పత్తిలో మన రాష్ట్రం అగ్రగామిగా ఉందని భువనేశ్వరి అన్నారు.
చేపల ఉత్పత్తిలో మన రాష్ట్రం అగ్రగామి : ఆంధ్రప్రదేశ్ 975 కి.మీ పొడవుతో గుజరాత్ తర్వాత రెండవ పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉందని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు కృషి వల్ల దేశంలోనే చేపల ఉత్పత్తిలో మన రాష్ట్రం అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. 2014 - 2019 మధ్య, మత్స్య రంగం ఏటా 19.17శాతం వృద్ధి చెందిందని గుర్తు చేశారు. మత్స్య సంపదలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్‌గా నిలబెట్టేందుకు, మత్స్యకారులు అహోరాత్రులు శ్రమిస్తున్నారని తెలిపారు. ఇలాంటి విజయాలు సాధించటానికి ప్రజా ప్రభుత్వం కావాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకి సహాయ సహాకారాలు అందించాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించగలరని స్పష్టం చేశారు. గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో అటువంటి ప్రభుత్వం లేకపోవటం మన దురదృష్టమని భువనేశ్వరి అన్నారు. టీడీపీ హయాంలో మత్స్య రంగం ప్రతి ఏటా 19.17 శాతం వృద్ధి సాధిస్తే, వైసీపీ హయాంలో వృద్ధి రేటు 6.44 శాతానికి పడిపోయిందని విమర్శించారు.
మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ : చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్తల కోసం భువనమ్మ కదిలిరావడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు పాలనలో భారత్ సాల్ట్ పరిశ్రమ తెచ్చి ఇక్కడ ఉపాధిని కల్పించారని గుర్తు చేశారు. భారత్ సాల్ట్‌ను కూడా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాలకు గుర్తింపునిచ్చిన పార్టీ తెలుగుదేశం అని వెల్లడించారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీదని తెలిపారు. టీడీపీ పాలనలో మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసారని గుర్తు చేశారు.
భువనేశ్వరికి ఘన స్వాగతం : కృష్ణా జిల్లాలో నిజం గెలవాలి యాత్రలో భాగంగా భువనేశ్వరి పర్యటించారు. మచిలీపట్నం నుంచి అవనిగడ్డ వెళ్తున్న భువనేశ్వరికు నిమ్మకూరు వద్ద పామర్రు అభ్యర్థి వర్ల కుమార్ రాజా, నాయకులు ఘన స్వాగతం పలికారు. నిమ్మకూరు మహిళలు ఆమెకు పసుపు కుంకుమ అందచేశారు. మహిళలతో భువనేశ్వరి మాట్లాడారు. వారు ఆమెతో ఫొటో దిగారు.