Nandigam Suresh to Police Custody: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. సురేష్‌ను రెండు రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ మంగళగిరి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 5వ తేదీన నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైఎస్సార్సీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. కార్యాలయం వద్ద వాహనాలు, అద్దాలు, కార్యాలయం లోపల ఫర్నిచర్ ధ్వంసం చేశాయి. అడ్డుకున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనపై కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినా, వైఎస్సార్సీపీ పాలనలో విచారణ ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు విచారణ తీవ్రం చేశారు.
దాడికి పాల్పడిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి 23 మందిని అరెస్టు చేశారు. వారిలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఉన్నారు. ఈనెల 5వ తేదిన సురేష్‌ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కీలకంగా ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌తో కలిసి కుట్ర చేసి వైఎస్సార్సీపీ మూకల్ని దాడికి పంపించినట్లు పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
అందుకే నందిగం సురేష్‌ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు భావించారు. గతంలో జరిగిన విచారణలో సురేష్ పోలీసులకు సహకరించలేదు. అందుకే మరోసారి విచారించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో ఉన్న సురేష్‌ను మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించవచ్చని చెప్పింది. ఈనెల 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి 17 మధ్యాహ్నం 1 గంట వరకూ విచారించవచ్చని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. నందిగం సురేష్ న్యాయవాది గంగాధర్ సమక్షంలో విచారణ జరగాలని సూచించింది.
వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్ నిరాకరణ - AP HC on YSRCP Bail Petitions
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు- సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్