MLC Janga Krishna Murthy on YSRCP: వైఎస్సార్సీపీలో సామాజిక న్యాయం మాటల్లోనే ఉందని, చేతల్లో లేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. గురజాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీలో అనేక అవమానాలకు గురయ్యానని జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీలో తాను బాగా కష్టపడినా, ఆత్మగౌరవం లభించకపోవడంతో ఆ పార్టీని వీడానని ఆయన తెలిపారు.
ఐప్యాక్ శిక్షణలో జగన్ భజన - చంద్రబాబుపై విమర్శలు - False allegations on Chandrababu
సామాజిక న్యాయం అంటే పదవి ఇవ్వటం కాదని, పార్టీలో తగిన గౌరవం ఇవ్వాలని జంగా కృష్ణమూర్తి తెలిపారు. పదవి ఇచ్చి ఆత్మాభిమానం భంగ పడేలా వ్యవహరించకూడదన్నారు. సామాజిక న్యాయం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం ఇవ్వాలని జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావును గెలిపించాలని జంగా కృష్ణమూర్తి కోరారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని జంగా కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.
సోమవారం మండలంలోని మోర్జంపాడులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'జయహో బీసీ' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్సార్సీపీలో కష్టపడ్డ వారికి గుర్తింపు, గౌరవం లేదన్నారు. గురజాల నియోజక వర్గంలో అవినీతి, అక్రమాలు పెరిగాయని, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనే లేదని పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.
అధికారం ఉందనే అహంకారంతో కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీలో బడుగు, బలహీన వర్గాలకు పదవులిచ్చినా పెత్తనం అంతా ఒక వర్గం చేతిలోనే ఉందని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు, వీరాస్వామి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
"వైఎస్సార్సీపీలో సామాజిక న్యాయం మాటల్లోనే ఉంది. కష్టపడినవారికి పార్టీలో తగిన గౌరవం లభించట్లేదు. వైఎస్సార్సీపీలో పెత్తనం అంతా ఒక వర్గం చేతిలోనే ఉంది. వైఎస్సార్సీపీలో అనేక అవమానాలకు గురయ్యాను. ఆత్మగౌరవం కోసమే వైఎస్సార్సీపీని వీడాను." - జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ