Minister Uttam Kumar Reddy Press Meet : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ(Congress vs BJP) మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోని బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి ధ్వజమెత్తారు. సూర్యాపేటలో జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శనివారం నల్గొండ పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో మఠంపల్లి మండలం మట్టపల్లిలో నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రులు రానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలను కోరారు.
దేశంలో నల్గొండ పార్లమెంటు(Nalgonda Parliamentary Constituency)కు ప్రత్యేక గుర్తింపు ఉందని, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ నాయకులు ఈ పార్లమెంటు స్థానం నుంచే ప్రాతినిధ్యం వహించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ దేశంలోనే అధిక మెజారిటీ సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 13 నుంచి 14 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Lok Sabha Election 2024 : మోదీ హయాంలో అన్ని విధాలుగా దేశంలో ప్రజాస్వామ్యం అణచివేయబడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తన పదవీ కాలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా నల్లొండ గళాన్ని పార్లమెంటులో వినిపించానని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన పట్టించుకొని నల్గొండ ప్రజలు తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొందని మంత్రి పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ మనుగడ ప్రశ్నార్థకం : ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి అవినీతికి పాల్పడ్డాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) కు కేంద్ర ప్రభుత్వ సంస్థలే నిధులు ఇవ్వడం బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి చేసిన అవినీతికి నిదర్శనమని ఆరోపించారు.
"మార్చి 30న నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్నెంట్‌ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో ఎన్నికల సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశం హుజూర్‌నగర్ నియోజకవర్గ మట్టపల్లిలో జరగనుంది. ఈ పార్లమెంటు నియోజకవర్గానికి నేనే ఇంఛార్జిగా దేశంలోనే కాంగ్రెస్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఇందుకు తామంతా కలిసి ప్రయత్నం చేస్తాము. గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేసినప్పుడు 4.30 లక్షల సభ్యత్వం చేసి భారతదేశంలోనే నంబర్ వన్ సభ్యత్వాలు నమోదు చేసిన నియోజకవర్గంగా మారింది. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం పని అయిపోయింది. బీజేపీతో తమకు ప్రధాన పోటీ." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి
హరీశ్‌రావు వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - మోటార్లకు మీటర్ల విషయంలో మాటల యుద్ధం