Manda Krishna Madiga Comments on CM Chandrababu: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబే అని, ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లే న్యాయం బతికిందని అన్నారు. చంద్రబాబు ఆనాడు ఎస్సీ వర్గీకరణ చేయకపోతే వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చేవి కావన్న ఆయన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉండటంతో వర్గీకరణ అమలు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ లాయర్‌ను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనివార్యంగా అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వర్గీకరణ పూర్తయ్యేవరకూ ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మందకృష్ణ మాదిక విజ్ఞప్తి చేశారు.
"వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు చేసిన ఈ పోరాటంలో ఎంతోమంది నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారందరికీ ఈ విజయం అంకితం చేస్తున్నాం. అనుకూల తీర్పునిచ్చిన జడ్జిలకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రక్రియ వేగవంతానికి చొరవ తీసుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ప్రక్రియను ముందుకు నడిపించిన వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు." - మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ కీలక తీర్పు వెలువరించింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.
ఎస్సీ వర్గీకరణకు సీఎం జగన్ అడ్డుపడుతున్నారు: మంద కృష్ణ మాదిగ
Former Minister Jawahar Comments: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి జవహర్ తెలిపారు. మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. మందకృష్ణ నాయకత్వంలో వర్గీకరణ సాధించటం చరిత్రలో నిలిచిపోతుందన్న ఆయన వర్గీకరణకు చంద్రబాబు ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరించారని కొనియాడారు. కులాల మధ్య చిచ్చు పెట్టి జగన్ చలి కాచుకున్నారని, మాదిగలను కేవలం ఓటుబ్యాంకుగానే చూశారని మండిపడ్డారు. ఈ క్రమంలో మాదిగలకు రాజ్యాంగ ఫలాలు అందాలన్నారు.
Dokka Manikyavaraprasad Comments: 30ఏళ్ల వర్గీకరణ పోరాటం నేటికి సాకారమైందని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును యథాతథంగా రాష్ట్రాలు అమలు చేయాలని కోరారు.