KTR about Telangana Financial in BRS Government : కేసీఆర్ హయాంలో భారీగా అప్పులు చేయడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్నవన్నీ దివాళాకోరు, తప్పుడు ఆరోపణలేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎకానమీ అండ్ పొలిటికల్ వీక్లీలో ప్రచురితమైన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్ సూచీలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థికమంత్రి సహా కాంగ్రెస్ నేతలు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థమవుతోందని తెలిపారు.
ఆర్థిక నిర్వహణలో 2014-15 నుంచి 2022-23 వరకు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న ఇండెక్స్‌ను కేటీఆర్ ఎక్స్‌లో షేర్ చేశారు. అప్పుల నిర్వహణ ఇండెక్స్, రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్‌లోనూ తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో అద్భుతమైన ఆర్థిక నిర్వహణతో పాటు అప్పుల విషయంలో ఎంత క్రమశిక్షణగా వ్యవహరించిందో ఆ గణాంకాలే సాక్ష్యమని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం పొద్దున లేస్తే దివాలా తీసిన రాష్ట్రమంటూ దిక్కుమాలిన ప్రచారం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు.
దివాళా తీసిందల్లా కాంగ్రెస్ నాయకత్వం : ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడం చేతగాక అప్పులపై తప్పుడు ప్రచారం చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టంగా ఉందని, దివాళా తీసిందల్లా కాంగ్రెస్ నాయకత్వం, వారి బుర్రలేనని మండిపడ్డారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పిచ్చి వాగుడు వాగుతూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్బీఐ నివేదికలు, కాగ్ గణాంకాలు, ప్రధానమంత్రి ఆర్థిక మండలి నివేదికలు, ఆర్థిక వేత్తల విశ్లేషణలన్నీ కూడా తెలంగాణ ఆర్థిక సౌష్టవాన్ని, పటిష్ఠతను పదేపదే నిరూపిస్తున్నప్పటికీ తప్పుడు ప్రచారాలు చేయటం శోచనీయమని అన్నారు.
Truth Prevails! Congress/BJP Lies Busted !
— KTR (@KTRBRS) October 22, 2024
Telangana shines as beacon of fiscal management ! The state has topped the charts in financial management index among Indian states from 2014-15 to 2022-23
With a stellar ranking of 2nd in debt management and resources management… pic.twitter.com/TD77uMxxAI
కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రచురించిన సామాజిక ఆర్థిక నివేదికలో కూడా పదేండ్ల తెలంగాణ ఆర్థిక సత్తాను కండ్లకు కట్టే గణాంకాలను చెప్పక తప్పలేదని కేటీఆర్ పేర్కొన్నారు. సొంత ఆదాయం సమకూర్చుకోవడంలో తెలంగాణ ఎప్పుడూ దేశంలోనే అగ్రస్థానంలోనే ఉందని, అప్పుల విషయంలో ఎప్పుడూ ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లు కేటీఆర్ వివరించారు. రెవెన్యూ వ్యయంలో వడ్డీల చెల్లింపు శాతం అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కేసీఆర్ చేసిన అప్పుల్లో సింహభాగం మూలధన వ్యయం చేశారని, ఆస్తులు, సంపద సృష్టి జరిగిందని తెలిపారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలి : కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం ఒక తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవమన్న కేటీఆర్, దేశాన్ని పోషించే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలవటం కేసీఆర్ కృషితోనే సాధ్యమైందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అత్యంత సమర్థంగా నిర్వహించినందు వల్లే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్‌లో నంబర్ వన్‌గా ఉన్నామని, తప్పుడు ప్రచారాలు చేసినందుకు ఇప్పటికైనా ప్రజలకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంతో కష్టపడి గాడిన పెట్టిన ఆర్థిక వ్యవస్థను చేతకాని విధానాలతో నాశనం చేయవద్దని సూచించారు.