Pawan Kalyan to Start Election Campaign : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 30 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ పోటీ చేసే పిఠాపురంలో రెండు విడతలుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పిఠాపురం, మళ్లీ ఏప్రిల్ 9న పిఠాపురంలో నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8 కాకినాడ గ్రామీణం, 10న రాజోలు, 11 పి గన్నవరం, 12 రాజానగరంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఇది మొదట విడత జరిగే ప్రచార కార్యక్రమని తెలిపారు. ఇది పూర్తైన వెంటనే రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం : రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కింది స్థాయి ఉద్యోగులపై దాడులు చేసేందుకు మాత్రమే ఏసీబీని ఉపయోగించారని, మంత్రులు, వారి పేషీలపై, అధికార పార్టీ నాయకులపై వచ్చిన ఫిర్యాదుల గురించి మాత్రం పట్టించుకోలేదు ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సీఎం జగన్ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటురని ఎద్దేవా చేశారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్ 14400కు 8.03లక్షల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. మంత్రులు, వారి పేషీలపై 2.06 లక్షలు, ఎమ్మెల్యేల అవినీతిపై 4.39లక్షల ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
ఎన్నికల్లో వీర మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలి: పవన్ - Pawan Kalyan on Veera Mahilalu
సీఎం నిర్వహించే అధికారిక సమీక్షలో ఏసీబీ డీజీ ఎవరని అడిగారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఏసీబీ గురించి ముఖ్యమంత్రే మర్చిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇప్పుడున్న యాక్టింగ్ డీజీపీనే ఏసీబీ డీజీగా కూడా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి తాండవిస్తుంటే ఒక్క రూపాయి అవినీతి జరగలేదని మీకు మీరే సెల్ఫ్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చుకుంటారని, ఐదేళ్లుగా అవినీతి జరగలేదని ఏసీబీ అధికారులు ఎలా చెబుతారని, ఫిర్యాదులపై ఏటా మీడియాకు చెప్పే ఏసీబీ కొన్నాళ్లుగా చెప్పడం లేదని తెలిపారు. రాష్ట్రంలో అవినీతిపై అహ్మదాబాద్ ఐఐఎం నివేదికను బుట్టదాఖలు చేశారని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక కుంభకోణాలపై చర్యలు తీసుకుంటామని నాదెండ్ల తెలిపారు.