Janasena Leader Murthy Yadav Comments on CS Jawahar Reddy : సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకే అధికారులు రైతుల పొలాల్లో రాళ్లు పాతారని జనసేన నేత మూర్తియాదవ్ ఆరోపించారు. జవహర్ రెడ్డి స్వయంగా వచ్చారని రైతులు చెబుతున్నారన్నారు. పేదల భూములు కొట్టేసేందుకు వైఎస్సార్సీపీ రాబందులు వస్తున్నాయని, బాధితులతో విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందని మూర్తి యాదవ్ హామీ ఇచ్చారు.
చావనైనా చస్తాం కానీ భూములివ్వబోమంటున్నారు విశాఖకు చెందిన వైఎస్సార్సీపీ నేతల భూకబ్జా బాధితులు. భూములను తాము 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్లు చెప్పారు. విశాఖకు చెందిన పలువురు భూకబ్జా బాధితులతో టీడీపీ, జనసేన నేతలు శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేయగా అల్లరి మూకలను ఉసిగొల్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన భూముల్లో రాళ్లు పాతుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు లాక్కోవడంలో సీఎస్ జవహర్‌రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నామని రైతులు తెలిపారు.
సీఎస్ ఆదేశాల మేరకే రైతుల పొలాల్లో అధికారులు రాళ్లు పాతారని, కానీ, భూములు ఇవ్వబోమని స్థానికులు పోరాడారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. సీఎస్ జవహర్‌రెడ్డే స్వయంగా వచ్చారని రైతులు చెబుతున్నారని గుర్తు చేస్తూ పేదల భూములు కొట్టేసేందుకు వైఎస్సార్సీపీ రాబందులు వస్తున్నాయని అన్నారు. జీవో నంబర్ 596ను అడ్డుపెట్టుకుని భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రైతులను భయపెట్టి భూములను కాజేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, రాయించుకున్న విషయం రైతులకూ తెలియదని వెల్లడించారు. రికార్డుల పరిశీలనకు అవకాశం లేకుండా వెబ్‌సైట్‌ను ఆపేశారని చెప్తూ సైట్ అది ఓపెన్ చేస్తే భూములు ఎవరిపేరుతో ఉన్నాయో పరిశీలించవచ్చని చెప్పారు. రైతుల గోడును కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, అవసరమైతే ఈసీ, కోర్టుకూ వెళ్తామని పీతల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు న్యాయం చేస్తుందని మూర్తియాదవ్ తెలిపారు.