Chandrababu Swearing in Ceremony in AP: ఏపీలో కొత్త ప్రభుత్వ మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో, ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు.
విజయవాడ నుంచి గన్నవరం మధ్యలోని కేసరపల్లిలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వేదికగా నిర్ణయించారు. పక్కనే జాతీయ రహదారికి తోడు సమీపంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, విజయవాడ నుంచి రాకపోకలకు సౌలభ్యంగా ఉండటంతో కేసరపల్లిని ఈ మెగా ఈవెంట్ కు వేదికగా తీర్చిదిద్దుతున్నారు. సుమారు 14 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను, ఇరువైపులా భారీ షెడ్లను నిర్మిస్తున్నారు. వేలాదిమంది కార్మికులు రాత్రి, పగలు తేడా లేకుండా పనులు చేపడుతున్నారు. ఆహ్వానితులకు పాసులు కేటాయించనున్నారు. ఇవన్నీ జీఏడీ విభాగం పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లకు నలుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీని వేసింది.
ఉప ముఖ్యమంత్రి పదవిపై జనసేనాని ఆసక్తి - Pawan Interested Deputy CM Post
ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల నుంచి జాతీయస్థాయి నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్న తరుణంలో, వారి కోసం సభా వేదికపై 50 మంది సరిపోయేలా ప్రధాన వేదికను నిర్మిస్తున్నారు. జాతీయస్థాయి నేతలతోపాటు సినీతారలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి కనీసం 150 మంది ఆహ్వానితులు వచ్చేందుకు పాసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. సభాప్రాంగణాన్ని పసుపు, ఎరుపు, తెలుపు రంగుల మేళవింపుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జగన్ ప్రభుత్వ బాధితులను ఆహ్వానిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం సహా 112 బాధిత కుటుంబాలకు వర్తమానం పంపినట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లు, బ్యారికేడ్లపై ప్రత్యేకదృష్టి సారించారు. పక్కనే కూలర్లతోపాటు వారికి కావాల్సిన తాగునీరు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాట్లను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. అరుదైన ఘట్టం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
కేసరపల్లి సభా ప్రాంగణం జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విజయవాడ నుంచి గన్నవరం మధ్య జాతీయ రహదారిపై సాధారణ రాకపోకలు నిలిపేస్తున్నారు. భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాలు రాకుండా ముందుగానే దారి మళ్లిస్తున్నారు. విజయవాడలో వీఐపీలు బస చేసే అవకాశమున్నందున ఆ మార్గంలో ఎలాంటి రద్దీకి అవకాశం లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా వీఐపీలు కేసరపల్లి సభా ప్రాంగణానికి చేరుకుంటున్న తరుణంలో ఈ మార్గంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం బుధవారం ఉదయం 11.27 గంటలకు జరిగనుంది. ఇందుకోసం ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.