Gadwal MLA Back to BRS : బీఆర్ఎస్లోనే కొనసాగనున్నట్లు గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లోకి వెళ్లిన అయన మంగళవారం రోజున అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్‌లోకి వెళ్లారు. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తనకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అన్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గులాబీ పార్టీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. త్వరలోనే కేసీఆర్‌ను కలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరగా కేటీఆర్ ఆయణ్ను సాదరంగా ఆహ్వానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీలో చేరుతూ వస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల వరకు చేరికల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా జులై 6న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
స్థానిక నేతలు వ్యతిరేకించినప్పటికీ పార్టీలో చేరిక : జులై 6న కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు అంతకముందే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఓ సమావేశంలో తన అనుచరులకు తెలియజేశారు. దీంతో ఆ సమయంలో స్థానిక గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సైతం ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ శ్రేణులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
పైగా గద్వాల కాంగ్రెస్ నాయకులతో సమావేశమై వారందరికి నచ్చజెప్పిన తర్వాతే ఆయన హస్తం పార్టీలో చేర్చుకున్నట్లు పార్టీ వర్గాలు కూడా తెలిపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఒక్కసారిగా హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు. తిరిగి తన సొంతగూడు అయిన బీఆర్ఎస్లో కొనసాగనున్నట్లు ప్రకటించారు. దీంతో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.