CPI And CPM Leaders Meet Sharmila : విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి. శ్రీనివాసరావు, కె. రామకృష్ణ ఇతర నేతలు సమావేశమయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే జాతీయ స్థాయిలో 'ఇండియా కూటమి (INDIA Alliance)'లో వామపక్ష పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో, పొత్తులపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు అవకాశం ఉంది.
వామపక్ష పార్టీల నేతల భేటీ అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అన్నారు. ఉమ్మడిగా ప్రజా పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ప్రత్యేక హోదా తెస్తాం - అధికారం ఇవ్వండని జగన్ అన్నారని, బీజేపీ మెడలు వంచుతామన్న జగన్, ఒక్క పోరాటం కూడా చేయలేదని గుర్తు చేశారు. హోదా కోసం కనీసం ఎంపీలు ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని అన్నారు. హోదా ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే ఏపీకి అప్పుడే ప్రత్యేక హోదా వచ్చేదని షర్మిల పేర్కొన్నారు. పోలవరం విషయంలో కూడా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు.
వైఎస్ షర్మిల అరెస్ట్ - మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలింపు
పదేళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని, ఇందకు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే కారణమని, కేంద్రంలో ఉన్న బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు హోదా ఇస్తామని తిరుపతిలో మోదీ ప్రకటించారని, కానీ నేటికీ మన హక్కులలో ఒక్కటి కూడా అమలు చేయలేదని వాపోయారు.
కాంగ్రెస్ 'చలో సెక్రటేరియట్' - ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల నిర్బంధం - ఉద్రిక్తత
చంద్రబాబు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని మంత్రి పదవులు తీసుకున్నారని అన్నారు. అమరావతి రాజధాని అని చంద్రబాబు త్రీడీ చూపారని, జగన్ అసలు మనకి రాజధాని లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. మనకి అన్ని విధాలా అన్యాయం చేసిన బీజేపీకి టీడీపీ, వైఎస్సార్సీపీ తొత్తులుగా మారాయని అన్నారు. మోదీకి చంద్రబాబు, జగన్లు బానిసలుగా మారి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని, తాము చేసిన పోరాటం ప్రజలు చూశారని, ఒక రాత్రి పార్టీ ఆఫీస్లో ఉండి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. తమ పోరాటానికి సీపీఎం, సీపీఐ నేతలు తమకు మద్దతు ఇచ్చారని తెలిపారు.
ఉమ్మడి రాజధానికి మరో రెండేళ్లంటే- ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమినట్లా?: వైఎస్ షర్మిల