Sharmila Election Campaign in Pulivendula : అవినాశ్‌ను ఓడించి జగన్‌కు బుద్ధి చెప్పండి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఓటర్లను కోరారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో తన సోదరి సునీతతో కలిసి షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్‌కు వివేకా అలాంటివారే, ప్రజల మనిషి వివేకా. అలాంటి నాయకుడు ఎక్కడా కనిపించని పరిస్థితి అని షర్మిల వాపోయారు. ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారని, ఐదేళ్లయినా హత్యచేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదని వాపోయారు. హత్య చేసినవాళ్లు, చేయించినవాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు. చిన్నాన్న హత్య విషయాలను గుర్తు చేసుకొని కంటతడి పెట్టిన షర్మిల ఎవరికి ఓటేస్తారో తేల్చుకోవాలని గద్గద స్వరంతో ప్రజలను కోరారు.
వైఎస్ వివేకా హత్య ప్రధానాంశంగా పులివెందులలో షర్మిల ఎన్నికల ప్రచారం - Sharmila Election Campaign
పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో వైఎస్ షర్మిలారెడ్డి, ఆమె సోదరి వైఎస్ వివేకా కూతురు సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారని తెలిపారు. వివేకా గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయింది అయినా ఇవాళ్టివరకు హత్యచేసిన వారికి, చేయించిన వారికి శిక్ష లేదని పేర్కొన్నారు. హత్య చేసినవాళ్లు, హత్య చేయించినవాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. వైఎస్ అవినాష్‌రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోందన్న వైఎస్ షర్మిల డబ్బు లావాదేవీల వంటి అన్ని సాక్ష్యాలను సీబీఐ బయటపెట్టిందని తెలిపారు. సాక్షాత్తూ సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారని ధ్వజమెత్తారు.
హంతకులను కాపాడుకోవడం న్యాయమా అని జగన్‌ను ప్రశ్నిస్తున్నా, సొంత చిన్నాన్నకే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? అని నిలదీశారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే హంతకుడిని కాపాడుకుంటారా? అని ప్రశ్నించారు. ఈ రోజు వరకూ ఒక్కరోజు కూడా అవినాష్‌ను జైలుకు పంపలేదని, ఐదేళ్లు అధికారంలో ఉండి అవినాష్‌కు శిక్ష పడకుండా కాపాడుతున్నారని, మళ్లీ అదే హంతకుడికి టిక్కెట్ ఇస్తారా? అని షర్మిల మండిపడ్డారు.
ఒకవైపు వైఎస్ బిడ్డ, మరోవైపు హంతకుడు ఉన్నారన్న షర్మిల, ఒకవైపు న్యాయం ఉంది మరోవైపు అధికారం ఉందని ఎటు ఉండాలో ప్రజలు తేల్చుకోవాలని కోరారు. న్యాయం కోసం పోరాడుతున్న తనను ఓటు వేసి గెలిపించాని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవ చేయాలని ఎంపీగా పోటీ చేస్తున్నానని, ఆశీర్వదించాలని కోరుతూ అవినాష్‌ను ఓడించి జగన్‌కు బుద్ధి చెప్పాలని పులివెందుల ప్రజలకు పిలుపునిచ్చారు. రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా మేము మీ ఇంటి బిడ్డలం అని చెప్పారు.
ప్రచారంలో దూసుకుపోతున్న షర్మిల - మద్దతు కూడగడుతున్న సునీత - Sunita Reddy meets YCP leaders
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం అని వైఎస్ వివేకా కూతురు సునీత అన్నారు. కరవు సీమకు నీళ్లు తేవడం ముఖ్యం కాదా? నీళ్లు తేవడానికి ఏం కృషి చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. తప్పు చేయాలంటే పదికి వందసార్లు ఆలోచిస్తామన్న సునీత మీరు ఓటు వేసిన వాళ్లు ఎక్కడున్నారు? అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మీకోసం పని చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారు? మనం న్యాయం వైపు ఉన్నామా? అన్యాయం వైపు ఉన్నామా? ఓటు వేసేముందు ఆలోచించి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి అని కోరారు. ధర్మం వైపు ఉండాలంటే షర్మిలకు ఓటు వేయాలని, మన కోసం పోరాడే షర్మిల వైపు మనం ఉండాలని అన్నారు.
సీఎం జగన్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడు కాదు: షర్మిల - YS Sharmila allegations on Jagan