Congress Jana Jathara Public Meeting in Tukkuguda : దిల్లీ గద్దెపై జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సభా వేదికగా కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖాన్ని పూరించనుంది. జాతీయ ఎన్నికల ప్రచారానికి తొలిమెట్టుగా ‘జన జాతర’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ సర్వం సిద్ధం చేసింది. సభా ప్రాంగణంలో మొత్తం మూడు స్టేజీలు ఏర్పాటు చేయగా, ప్రధాన స్టేజీ మీద 300 మంది కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. లక్ష మంది మహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎల్ఈడీ (LED) స్క్రీన్లు అమర్చుతున్నారు.
14 లోక్‌సభ స్థానాలే లక్ష్యం : ఈ నెల 5న పార్టీ జాతీయ మేనిఫెస్టోను దిల్లీలో సోనియా, ఖర్గే, రాహుల్ విడుదల చేశారు. అందుకు సంబంధించిన తెలుగు ప్రతిని నేడు జరిగే జన జాతర సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో నెగ్గి కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెలంగాణ, కర్ణాటక అత్యంత ముఖ్యమని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ అధిక లోక్‌సభ స్థానాలు నెగ్గే రాష్ట్రాల్లో ఆ రెండు రాష్ట్రాలు ముందుంటాయని నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17లో 14 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నందునే జాతీయ ఎన్నికల ప్రచార సమరశంఖాన్ని హైదరాబాద్ నుంచే పూరించాలని నిర్ణయించింది.
CM Revanth Review on Congress Jana Jatara Sabha : రాహుల్‌గాంధీ సభతో ప్రచారాన్ని ప్రారంభిస్తే, రాష్ట్రంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని నాయకుల అంచనా. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘విజయ భేరి’ పేరిట తుక్కుగూడలో సభా వేదికగా ఆరు గ్యారంటీ హామీల ప్రకటనతో పార్టీకి సానుకూలత ఏర్పడిందనే సెంటిమెంటుతో లోక్‌సభ ఎన్నికలకు అదే వేదికను ఎంచుకున్నారు. జన జాతర సభ ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు సభాస్థలికి వెళ్లి అధికారులు, నేతలకు పలు సూచనలిచ్చారు.
వారికే అధిక ప్రాధాన్యం : శుక్రవారం కూడా పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్యనేతలు తుక్కుగూడలో ఏర్పాట్లను సమీక్షించారు. అగ్రనేతలు వస్తుండటంతో పాటు, తెలంగాణ వేదికగా జాతీయ ప్రచారానికి సమరశంఖాన్ని పూరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినందున సభను విజయవంతం చేయాలని నేతలు వివరించారు. కాంగ్రెస్ విడుదల చేసిన జాతీయ మేనిఫెస్టో (Congress National Manifesto)లో నిరుద్యోగులు, రైతులు, మహిళలు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చినందున, ఆ సభకు వారిని ఎక్కువగా తరలించాలని నిర్ణయించారు.
కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా వివరించనున్నట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలు సభకు తరలివస్తారని చెబుతున్న పార్టీ, ఆ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సభ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా బయట ప్రాంతాల నుంచి తరలివచ్చే జనానికి మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఎవరూ వడ దెబ్బకు గురి కాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.