CM YS Jagan Met YSRCP Rebel Candidates: సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అసంతృప్తి నేతలు కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తి విమానాశ్రయంలో జగన్ దిగిన వెంటనే వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వ్యతిరేక వర్గ నేతలు సోమశేఖర్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డిలు కలిశారు. వీరిని చూడగానే సీఎం పలకరించి, వారు తెచ్చిన శాలువను వారికే కప్పి మాట్లాడారు.
పుట్టపర్తిలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి పని చేయాలని సీఎం జగన్ చెప్పగానే, తాము అతనితో పని చేయలేమని సోమశేఖర్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డిలు సీఎంకు స్పష్టం చేసినట్లు సమాచారం. అందరూ కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో శ్రీధర్ రెడ్డి ఇంట్లో కూర్చొని మాట్లాడాలని జగన్ చెప్పారు. అయితే తాము శ్రీధర్ రెడ్డి ఇంటికి వెళ్లేది లేదని, మరోచోటు చెబితే తాము కలవటానికి సిద్ధంగా ఉన్నామని అసంతృప్త నేతలు సోమశేఖర్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డిలు తెలిపారు. వీరితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యత అప్పగించినట్లు సమాచారం.
రేపో ఎల్లుండో వైసీపీ ఐదో జాబితా - టికెట్ ఉంటుందో ఊడుతుందో తెలియక నేతల టెన్షన్
మరోవైపు ఉరవకొండలో నిర్వహించిన సీఎం సభలో మంత్రి ఉష శ్రీచరణ్, ఎంపీ తలారి రంగయ్యలు పక్కపక్కనే కూర్చున్నా ఎడముఖం, పెడముఖంగా ఉన్నారు. నాలుగేళ్లుగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తలారి రంగయ్య వర్గానికి, మంత్రి ఉష శ్రీచరణ్ వర్గానికి మధ్య ఆదిపత్యపోరు సాగుతోంది. దీంతో ఈ వర్గాలకు ఆధిపత్యం వహిస్తున్న ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్న విషయం కళ్యాణదుర్గంలో అనేకసార్లు బట్టబయలైంది.
తాజాగా ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చున్నా ఎవరికివారు అన్నట్లుగా ఇద్దరు వ్యవహరించారని వైసీపీ నాయకులు సభావేదిక వద్ద చర్చించుకున్నారు. సీఎం సభ ముగిసిన తరువాత ఉరవకొండ జూనియర్ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్ వద్ద జగన్ పలువురి నేతలతో మాట్లాడారు. రెండు గంటలపాటు అక్కడే ఉండి, అనంతపురం పార్లమెంటులోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన విషయాలు చర్చించినట్లు సమాచారం.
ఎవరి లెక్కలు వారివే! - వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాల పర్వం
మరోవైపు ఇప్పటికే వైసీపీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది. పార్టీ విధేయులుగా ఉన్నవారికి కూడా జగన్ మొండిచేయి చూపడంతో పలువురు అసంతృప్త నేతలు పార్టీని వాడారు. వైసీపీ ప్రకటించిన ఇన్ఛార్జ్ల జాబితాపై ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలువురు అధిష్ఠానానికి హెచ్చరికలు పంపిస్తున్నారు. టికెట్లు కోల్పోయిన అసంతృప్త ఎమ్మెల్యేలు అధినాయకత్వంపైనే నేరుగా యుద్ధం ప్రకటిస్తున్నారు. తమను కాదని నియోజకవర్గాల్లో ఎన్నికలకు ఎలా వస్తారో చూస్తామంటూ తెగేసి చెప్తున్నారు. అధిష్ఠానం బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నా అవి సఫలం కావడం లేదు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు సైతం రాజీనామా చేశారు. తుది జాబితా వచ్చేసరికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చు.
మమ్మల్ని కాదని వస్తారా- వైసీపీలో మొదలైన తిరుగుబాటు! కాళ్లబేరానికి సిద్ధమైన అధిష్ఠానం