CM Revanth On KCR Latest News : ఓడిపోయిన తర్వాత కూడా కుటుంబంలోని నలుగురి ఘెష మాత్రమే వినిపిస్తోందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వివాదాల పేరుతో వేలాది ఉద్యోగాల భర్తీని గత ప్రభుత్వం నిలిపివేసిందన్న ఆయన, తాము కోర్టు కేసులను పరిష్కరించి నియామక పత్రాలు ఇస్తున్నామని తెలిపారు. నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సచివాలయంలో ఇవాళ సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా (One Crore Insurance Scheme Telangana) పథకాన్ని రేవంత్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో దశాబ్ద కాలంగా కారుణ్య నియామకాలు జరగలేదని చెప్పారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని అన్నారు.
"కేసీఆర్ కట్టి కూల్చిన వాటిని పునర్ నిర్మించడం గురించి ఆలోచిస్తున్నాం. కుంగిపోయిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎలా ఎత్తిపోయాలో చెప్పమంటే చెప్పట్లేదు. అన్నారం పగిలిపోయి ఉన్న నీళ్లు వృథాగా పోతున్నాయి. కుంగిన మేడిగడ్డ నుంచి పగిలిపోయిన అన్నారంలోకి నీళ్లు ఎత్తిపోయాలని హరీశ్‌రావు చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వం వందల టీఎంసీలు తరలించుకుపోతుంటే పట్టించుకోలేదు. ఏపీ సీఎం జగన్‌కు విందు ఇచ్చి ఒప్పందాలు చేసుకొని కృష్ణా జలాలు ఇచ్చారు." - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
CM Revanth Comments on KCR Govt : మరోవైపు బీజేపీపైనా రేవంత్ నిప్పులు చెరిగారు. మోదీని మరోసారి ఎందుకు గెలిపించాలో కిషన్ రెడ్డి (Revanth On Kishan Reddy) చెప్పాలని అన్నారు. మద్దతు ధర అడిగిన రైతులను చంపినందుకు మళ్లీ గెలిపించాలా? అని ప్రశ్నించారు. వరదలు వచ్చి హైదరాబాద్ నష్టపోతే కిషన్‌రెడ్డి ఏమైనా కేంద్ర నిధులు తెచ్చారా? అని నిలదీశారు. గత పదేళ్లలో కేసీఆర్, మోదీ కలిసి తెలంగాణకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. గత పదేళ్లలో కేసీఆర్ వందేళ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం చేశారని ఆరోపించారు. 75 రోజులుగా రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దటం గురించే ఆలోచిస్తున్నామని తెలిపారు.
సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభం
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ (Ambedkar Knowledge Center in Telangana) నిర్మించాలని యోచిస్తున్నామన్న రేవంత్ రెడ్డి, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర బాగు కోసం ఎవరు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని అన్నారు. నిస్సహాయులు ఎవరనేది నిర్ణయించడానికి ఏదైనా కొలమానం అవసరం అని పేర్కొన్నారు. ఏ కొలమానం లేకుండా పథకం వర్తింపచేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైవేలకు కూడా రైతుబంధు నిధులు వెళ్లాయని ఆరోపించారు.
"సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే వర్తించాలని రేషన్‌కార్డ్ నిబంధన పెడుతున్నాం. లబ్ధిదారుల గుర్తింపు నిరంతరం కొనసాగుతుంది. కొత్త రేషన్‌కార్డులు జారీ చేసి నిరంతరం కొత్త లబ్ధిదారులను చేరుస్తాం. ఏ కొలమానం లేకుండా ఇస్తే కోటీశ్వరులు కూడా దరఖాస్తు చేసుకుంటారు. కొన్నేళ్లుగా వానలు బాగా పడటం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్రంలో బోర్ల సంఖ్య పెరగటం వల్లే వరి ఉత్పత్తి పెరిగింది. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవటం వల్ల ఇప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఇప్పుడు భూగర్భ జలాలను కేసీఆర్ పెంచుతారా?"- రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆదాయ లక్ష్యం పూర్తి చేయాల్సిందే - సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం