CM Revanth Sensational Comments on BJP : ఆర్‌ఎస్‌ఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌షా ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వివిధ కులాలు, వర్గాలు ఉంటే హిందువులు ఏకతాటి మీదకు రారనీ, రిజర్వేషన్లు రద్దు చేస్తే, హైందవులంతా ఒకటే అనే భావన కలుగుతుందని ఆ పార్టీ భావిస్తోందన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి వందేళ్లవుతుందని, అప్పటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని ఆరోపించారు. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరమని, అందుకే 400 సీట్లలో గెలిపించాలని మోదీ పదేపదే కోరుతున్నారని వ్యాఖ్యానించారు.
అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ అజెండా : అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో బీసీలు 50శాతానికి పైగా ఉన్నారని, జనగణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ దేశ రాజకీయాలను, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అంశంపై విస్పష్టంగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
"ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతో ఇవాళ అమిత్ షా, మోదీ దేశ సార్వభౌమాధికారం మీద దాడిచేస్తున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకున్నారు. అందుకోసం మూడింట్లలో రెండు వంతుల మెజారిటీ వారి సొంతంగా ఉంటే, మిగిలిన రాష్ట్రాల్లో శాసనసభల్లో తీర్మానాలను బెదిరించైనా సరే ఆమోదింపజేయటానికి అన్నిరకాలుగా ప్రణాళికలు రచించి, 400 సీట్లలో గెలిపించాలని మోదీ పదే పదే కోరుతున్నారు."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
Revanth Reddy Hot Comments on PM Modi : అక్రమంగానో, దౌర్జన్యంగానో 400 సీట్లు సాధించి రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలపైనే దాడి చేయాలని మోదీ, అమిత్ షా కంకణ బద్దులై ఉన్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే దేశం నలుమూలలా తిరుగుతూ అన్ని రకాల వ్యవస్థలు, సంస్థల్ని ఉపయోగించుకొని ముప్పేట దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత బీజేపీపై, కాంగ్రెస్ స్పష్టమైన ఆరోపణలు చేస్తోందన్న ఆయన, తమ ప్రశ్నలకు ఇప్పటి వరకు నరేంద్రమోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సమాధానం చెప్పలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలు, విధానాలకు విరుద్ధంగా వారు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు : రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ, బీఆర్ఎస్ ఒకే విధానంతో ఉన్నాయని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి విమర్శించారు. మల్కాజిగిరిలో బీజేపీని గెలిపిస్తామని శుక్రవారం గులాబీ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారని, ఆయనపై కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈటలను కేటీఆర్ ఎందుకు విమర్శించడం లేదన్న రేవంత్‌రెడ్డి, ఐదు నియోజకవర్గాల్లో కమలానికి గులాబీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
అది నిజమని శుక్రవారం మల్లారెడ్డి మాటలతో స్పష్టమైందని తెలిపారు. పదేళ్లపాటు కేసీఆర్ భూములు అమ్ముతుంటే ఈటల రాజేందర్ ఎప్పుడైనా మాట్లాడలేదు కానీ, తాను రుణమాఫీ చేస్తాను అనగానే భూములు అమ్మవద్దని ఈటల కండీషన్లు పెడతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేశారు : సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth on Modi and KCR