CM Jagan is Working on YSRCP 7th List: వైఎస్సార్సీపీలో అసెంబ్లీ అభ్యర్థుల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న నేతలకు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు తాడేపల్లి సీఎంవో నుంచి పిలుపు అందింది. ఈ మేరకు సీఎంవోకు చేరుకున్న నేతలతో వైఎస్సార్సీపీ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు.
మంగళగిరిలో మహిళకు అవకాశం!: మంగళగిరి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ఇన్చార్జి గంజి చిరంజీవిని మార్చి మహిళ టికెట్‌కు ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గంజి చిరంజీవి, వర్గం కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వర్గాల మధ్య వర్గపోరు నేపథ్యంలో, చిరంజీవి మార్పుపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గంజి చిరంజీవిని మంగళగిరి అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ప్రకటించింది. అయితే గంజి చిరంజీవి, కాండ్రు కమల, మురుగుడు హనుమంత రావు వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళకు టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాండ్రు కమలకు మంగళగిరికి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆయన వర్గం నేతలు పట్టుబడుతున్నారు. పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ చేస్తుండటంతో సీఎం జగన్ ఇక్కడ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా
నిన్న గుమ్మనూరు నేడు విరూపాక్ష: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి విరూపాక్ష సీఎంవోకు వచ్చారు. ఆలూరు వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్‌ను కలిశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంను కాదని ఆలూరు టికెట్ విరూపాక్షకు ఇచ్చారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సీఎం జగన్ జయరాంకు సూచించారు. అయినప్పటికీ గుమ్మనూరు పోటీకి నిరాకరిస్తున్నారు. తనకు ఆలూరు టికెట్ కావాలని పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో గుమ్మనూరు నిన్న సీఎంవోకు వచ్చి వెళ్లారు. ఆలూరు అంశంపై సీఎం జగన్ జయరాంకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జయరాం వ్యతిరేకవర్గంతో సీఎం సమావేశంతో చర్చలు జరిపారు.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యానికి బాధ్యులెవరు- సుప్రీంకోర్టు ప్రశ్న
మరో చోట అవకాశం ఇవ్వండి: ఇటీవలే రేపల్లె ఇన్‌ఛార్జ్‌గా ఈవూరి గణేశ్‌ను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. రేపల్లె టికెట్ ఇవ్వాలని మోపిదేవి వెంకటరమణ పట్టుబడుతున్నారు. ఇక కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సైతం మరోసారి సీఎంవోకు వచ్చారు. కనిగిరి ఇన్‌ఛార్జ్‌గా దద్దాల నారాయణ యాదవ్‌ను నియమించిన నేపథ్యంలో, కనిగిరిలో కాకపోయినా, మరోచోటైనా అసెంబ్లీ సీటు ఇవ్వాలని బుర్రా కోరుతున్నారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు తన కుమారుడు చంటినాయనను తీసుకుని సీఎంవోకు వచ్చారు. చీరాల అసెంబ్లీ టికెట్ కోసం ఆమంచి కృష్ణమోహన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసిన పర్చూరు వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ మరోసారి సీఎంవోకు వచ్చారు. చీరాల అసెంబ్లీ టికెట్ తనకే ఇవ్వాలంటూ కోరుతున్నారు.
కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు: మంత్రి ఉత్తమ్