TDP Parliamentary Meeting : రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అజెండాగా పోటీ పడి పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని ఆదేశించారు.
ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చర్చ చేపట్టారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవలసిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై సూచనలు చేశారు.
అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధనపై చర్చ : అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయంపై చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖలు చొప్పున బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి మంత్రుల్ని కూడా వారికి జత చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల సాధనపై చర్చించినట్లు సమాచారం.
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం : జల్ జీవన్ మిషన్, క్రిషి సించాయీ యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయంపై చర్చించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై చర్చకు వచ్చినట్లు సమాచారం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
దిల్లీలో జగనేం చేస్తాడో ముఖ్యం కాదు : దిల్లీలో జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేయనున్నారన్న అంశంపై భేటీలో ప్రస్తావనకు వచ్చింది. జగన్ గురించి వైఎస్సార్సీపీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అన్నట్లు తెలుస్తోంది. జగన్ గురించి ఒక్క క్షణం ఆలోచించే సమయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి తెలిపారు. దిల్లీలో జగనేం చేస్తాడో ముఖ్యం కాదని, మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు : ఈసారి కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తామన్నారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్న క్రమంలో రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో వెసులుబాటు కల్పించమని కేంద్రాన్ని కోరతామని, కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నమని రామ్మోహన్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరమని అన్నారు.
ఉల్లాసంగా, ఉత్సాహంగా!- టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం - Chandrababu Meeting with MPs
వివిధ పథకాలకు వచ్చే కింద కేంద్ర నిధులను ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు. గత ఐదేళ్లల్లో కేంద్ర నిధుల్లోనూ అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రులే స్వయంగా సీఎం దృష్టికి తెచ్చారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని, విశాఖ రైల్వే జోనుకు భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనే విషయం కేంద్రం దృష్టికీ తీసుకెళ్లామని వెల్లడించారు.
జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం : తమకు కేటాయించిన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తమపై ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. వివిధ శాఖల మంత్రులతో, కార్యదర్శులతో తాము సమన్వయం చేసుకుంటామన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన్నట్లు చిన్ని తెలిపారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల్లో నియోజకవర్గాల సమస్యలపై ప్రస్తావిస్తామన్నారు. ఏపీలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు రాజకీయ హత్యల్లో తెలుగుదేశం నేతలు బాధితులుగా ఉన్నారని వాపోయారు. దిల్లీ వేదికగానే తాము కూడా జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని తేల్చి చెప్పారు.
మూడు నెలలకోసారి సమీక్ష : ఎంపీలుగా గెలిచిన ఆనందం ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తోంటే బాధేస్తోందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. తమ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో కేంద్ర మంత్రులే వివరిస్తున్నారని వాపోయారు. ఏపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను అంగీకరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడమే కాదని, దగ్గరుండి మరీ పని చేస్తామన్నారు. ఎంపీల పనితీరు మీద ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తామని చంద్రబాబు చెప్పారని ఎంపీ లావు తెలిపారు. వినుకొండ ఘటనకు జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని ఆక్షేపించారు. వినుకొండ ఘటన గ్రూపుల గొడవే, రెండున్నరేళ్ల నుంచి ఆ గ్రూపుల మధ్య గొడవ జరుగుతూనే ఉందన్నారు.