Chandrababu Praja Galam Meeting in Kovvur: వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జగన్ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారం చేసి, ప్రశ్నార్థకం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి బీజేపీతో జట్టు కట్టామని స్పష్టం చేశారు. మిత్రపక్షంతో వచ్చి కూటమిగా జట్టు కట్టామని, జగన్‌కు శవరాజకీయాలు చేయడం అలవాటు అని ధ్వజమెత్తారు.
2019లో శవరాజకీయాలు చేసి జగన్ ఓట్లు అడిగారని అన్నారు. తండ్రి లేరంటూ, బాబాయ్‌ను చంపారంటూ జగన్ ఓట్లు అడిగారని ఎద్దేవా చేశారు. రక్తంలో మునిగిన వైసీపీకి ఓట్లు వేయవద్దని జగన్ చెల్లి కోరుతున్నారని, హత్యలు, శవ రాజకీయాలు చేసేవారు ప్రజలకు కావాలా అని ప్రశ్నించారు.
వాలంటీర్లు వైసీపీకి పని చేయడం సరికాదు: వాలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని, వాలంటీర్లు వైసీపీకి పని చేయడం సరికాదని హితవు పలికారు. టీడీపీ వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వొద్దని వాలంటీర్లను కోరుతున్నానన్నారు. ప్రజలకు సేవ చేయాలని వాలంటీర్లను కోరుతున్నానని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వీలుందన్న చంద్రబాబు, ఎండలో సచివాలయానికి వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్‌కి పాలించడం చేతకాదు: జగన్‌కి పాలించడం చేతకాదన్న చంద్రబాబు, ఎవరినీ చంపకుండా పింఛన్లు ఇవ్వాలని విమర్శించారు. వైసీపీ ఇవ్వలేకపోతే టీడీపీ వచ్చాక పింఛన్లు ఇస్తామని గుర్తు చేశారు. దీంతో భయపడి డబ్బులు విడుదల చేశారని, ఇంతకుముందు ఈ బుద్ధి ఏమైందని ఎద్దేవా చేశారు. ఫ్యాన్‌ను ముక్కలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గొడ్డలి చూపి బెదిరిస్తున్నారని, వైసీపీకి గొడ్డలి గుర్తు పెట్టుకో అంటూ విమర్శించారు. గొడ్డలితో రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు.
అనపర్తి అసెంబ్లీ స్థానంపై కీలక వ్యాఖ్యలు: పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన అనపర్తి అసెంబ్లీ స్థానం మార్పు ఉంటుందంటూ తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న చర్చపై పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో రాజానగరం, నిడదవోలులో జనసేన పోటీ చేస్తోందన్న చంద్రబాబు, రాజమండ్రి ఎంపీగా పురందేశ్వరి పోటీ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. మిగిలిన ఐదు స్థానాల్లో ఒక అసెంబ్లీ సీటు బీజేపీకి ఇచ్చామన్నారు. బీజేపీ ఇచ్చిన అసెంబ్లీ సీటు ఇంకా నిర్ణయం కాలేదని పేర్కొన్నారు.
రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న అనపర్తి స్థానానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తొలి జాబితాలో తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీతో పొత్తు కుదిరాక, ఆ స్థానంలో శివకృష్ణం రాజును బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే అనపర్తి స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థే పోటీ చేస్తే, రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో బీజేపీకి గెలుపు సులభతరమవుతుందనే వాదన గతకొంతకాలంగా నడుస్తోంది. దీనిపై తెలుగుదేశం-బీజేపీలు పునరాలోచనలో పడి స్థానం మార్పుపై చర్చలు జరుపుతున్నాయి. తాజాగా కొవ్వూరు సభలో చంద్రబాబు అనపర్తి స్థానం బీజేపీకి కేటాయించినా ఇంకా నిర్ణయం కాలేదంటూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
జగన్‌కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు: చంద్రబాబు - chandrababu praja galam yatra
సంపద సృష్టించి పేదలకు పంచుతాం: తాము అధికారంలోకి వచ్చిన తరువాత సంపద సృష్టించి పేదలకు పంచుతామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ వచ్చిన వంద రోజుల్లో ఏపీలో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్ మద్యం ఉండవని తెలిపారు. ఇసుక కొరత ఉండదని అన్నారు. విద్యుత్ ఛార్జీలు సైతం పెరగవని హామీ ఇచ్చారు. టీడీపీ వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని, ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అందజేస్తామని, ఆడబిడ్డలకు 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు.
ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత తనదని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అదే విధంగా ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి రైతును రాజుగా చేసే బాధ్యత తనదన్న చంద్రబాబు, రైతు కూలీలు, కౌలురైతుల కోసం కార్పొరేషన్ పెడతామని అన్నారు. రూ.4 వేల పింఛన్ ఒకటో తేదీన ఇంటి వద్దే ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.