Chandrababu Naidu Fire on CM Jagan : వైఎస్సార్సీపీలో తిరుగుబాటు మొదలైందని, జగన్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్ అధికారం చేపట్టిన నుంచి ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని విమర్శలు చేశారు. ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తున్నారని, ఆకు కూరలు దొరకడం లేదు గానీ, రాష్ట్రంలో గంజాయి దొరుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయికి బానిసల్ని చేసి యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని అన్నారు. సంస్కరణలకు నాంది పలికిన పార్టీ టీడీపీ అని, ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చామని పెర్కోన్నారు. వైఎస్సార్సీపీ సర్కార్‌లో 9 సార్లు ఛార్జీలు పెంచారు. పన్నుల బాదుడుతో పేదల రక్తాన్ని తాగుతున్నారని నిప్పులు చెరిగారు.
188 మందిని పొట్టన పెట్టుకున్నారు : జగన్ చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ సైకో పనులని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దళితులెవరూ నోరెత్తకూడదు. ప్రశ్నించకూడదంటూ వారు స్వరం వినిపిస్తే గొంతు నొక్కేస్తు చంపేస్తారని ఆరోపించారు. నాలుగున్నర సంవత్సరాల్లో ఆరు వేల దాడులు చేశారని, 188 మందిని పొట్టన పెట్టుకున్నారని అన్నారు. మాస్క్ అడిగిన సుధాకర్‌ను పిచ్చోణ్ని చేసి చంపేశారని, బాబాయిని చంపిన అవినాష్‌రెడ్డి మాత్రం రోడ్డుపై తిరుగుతున్నారని, కోడికత్తి శ్రీను ఐదు సంవత్సారాల నుంచి జైలులో ఉన్నారని. సామాజిక న్యాయమంటే ఇదేనా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందు పులివెందులలో గెలిచి చూపించు జగన్- చంద్రబాబు సవాల్
ఉన్మాది పాలనలో అందరూ బాధితులే : వైఎస్సార్సీపీ నాయకులు తమ బొమ్మలు పెట్టి కొట్టే వికృత పనులను చేస్తున్నా ప్రజల కోసం భరిస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖ జిల్లాలో జగన్ సిద్ధం సభ వేళ జరిగిన ఘటనను ఆయన తప్పుబట్టారు. వైఎస్సార్సీపీ పార్టీ ఇంటికి పంపిచడానికి ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. ఎన్నికలు అయిపోగానే వైఎస్సార్సీపీ ఖాళీ అవుతుందని అన్నారు. నడిరోడ్డుపై మహిళలను ఆ పార్టీ నేతలు వేధిస్తున్నారని, మాచర్లలో దుర్గారావు అనే కార్యకర్తను పోలీసులు వేధించారని ఆరోపించారు. ఉన్మాది పాలనలో అందరూ బాధితులే అని అన్నారు. ఆ పార్టీని భూస్థాపితం చేయాలని ఓటర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం - జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: చంద్రబాబు
నాది విజన్, జగన్‌ది పాయిజన్ : అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అయి ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేది అని పల్నాడు జిల్లా పొన్నూరులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు అన్నారు. దేశంలోని టాప్-10 వర్సిటీలు, స్కూళ్లు రాష్ట్రానికి తీసుకురావాలని అనుకున్నామని, అమరావతి రాజధానిని జగన్ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కట్టిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులు వేసుకున్నారని అన్నారు. అమరావతికి పూర్వ వైభవం కేవలం టీడీపీతోనే సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఐదు సంవత్సరాలలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని, ప్రజలకు బంగారు భవిష్యత్తు అందిస్తానని హామీ ఇచ్చారు. తనది విజన్ అయితే జగన్‌ది పాయిజన్ అని పేర్కొన్నారు.
పేదరికం లేని సమాజాన్ని చూడాలి : ఉద్యోగులు, పింఛన్‌దారులకు రూ.20 వేల కోట్లు, గుత్తేదారులకు రూ.95 వేల కోట్లు బకాయిలు పెట్టారని చంద్రబాబు తెలిపారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పారదర్శకంగా పని చేయకపోతే ప్రమాదం వస్తుందని తెలిపారు. తప్పుడు పనులను సమర్థించిన వారిని వదిలే ప్రసక్తే లేదని, పోలీసుల న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని, ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది తన ఆశయమని చంద్రబాబు తెలిపారు.
జగన్‌కు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు తరలిపోతున్నాయి- వైసీపీ ఓటమి ఖాయమైంది: చంద్రబాబు