Chandrababu Naidu fire on CM Jagan : వైసీపీ కుటిల రాజకీయల కోసం వాలంటీర్లను బలిపశువులను చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని నేతలు బెదిరిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలో అధికారులు భాగస్వామ్యం కావడం దుర్మార్గమన్నారు. పింఛన్‌ల పంపిణీ డోర్ డెలివరీ చెయొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. పింఛన్ల విషయంలో వైసీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు.
శవ రాజకీయాలు మానుకోవాలి: మనం చేసే పనుల వల్ల ఓట్లు అడగాలన్న చంద్రబాబు, ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని, బాబాయ్‌ని చంపేసి మళ్లీ దండేసి సానుభూతి పొందారని చంద్రబాబు విమర్శించారు.
13 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు: ఓడిపోతామని తెలిసే 13 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. పింఛన్లు ఇవ్వాలంటే ముందుగానే డ్రాచేసి పెట్టుకోవాలి కదా అని ప్రశ్నించారు. డోర్ డెలివరీ ఇవ్వొద్దని ఎన్నికల సంఘం ఎక్కడా చెప్పలేదన్న చంద్రబాబు, వాలంటీర్లను ఎన్నికల కోసం ఉపయోగించాలని పన్నాగం పన్నారని విమర్శించారు. ఈ కుట్రలో అధికారులు భాగస్వామ్యం కావడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. వాలంటీర్ వ్యవస్థను తామూ కొనసాగిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
వైసీపీ కుట్ర ప్రజలకు అర్థమైంది: వాలంటీర్లు తటస్థంగా ఉంటే సహకరిస్తామని చెప్పారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని, మీ స్వార్థం కోసం వాలంటీర్లను ఇబ్బందిపెడతారా అంటూ వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై కేసులు పెడితే ఉద్యోగాలు ఎలా వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ గెలుపు కోసం వాలంటీర్లను బలిపశువులను చేస్తారా అని దుయ్యబట్టారు. రాజకీయాల్లో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదన్న చంద్రబాబు, పింఛన్ల విషయంలో వైసీపీ కుట్ర ప్రజలకు అర్థమైందని తెలిపారు.
సీఎం పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలి: పింఛనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలు అని విమర్శించిన చంద్రబాబు, ప్రభుత్వ హత్యలు చేసిన సీఎంకు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలు పోవడానికి సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) కారణమయ్యారని ఆరోపించారు. సీఎం పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంటి వద్దే పింఛన్లు ఎందుకు ఇవ్వలేదో జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు మండిపడ్డారు. ఇంటి వద్ద ఇవ్వొద్దని ఎన్నికల సంఘం ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు.