Bandi Sanjay Slams the TG Govt: ప్రజల దృష్టి మరల్చేందుకే అమృత్ పథకంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఆటలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అమృత్‌లో జరిగిన అవినీతి బయటకు రావాలంటే సీవీసీ విచారణను కోరాలని డిమాండ్ చేశారు. దేశంలోని పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చే ఒక సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెడితే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాయని బండి సంజయ్ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.
ఈ పథకంలో అవినీతి జరిగిందని ఈ రెండూ పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నాయని ఆక్షేపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడి తమకు కావాల్సిన వాళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రత్యారోపణలు చేయడం దొందుదొందే అన్న విధంగా ఉందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలులో వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు వీరిరువురూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటూ డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందానికి రాజ్యసభ అభ్యర్థే సాక్షి : కేంద్రమంత్రి బండి సంజయ్
సెంట్రల్ విజిలెన్స్ కావాలి: దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా వీరిద్దరూ ఈ పథకంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడి, తమకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించుకొని, పెద్దఎత్తున కమీషన్లు కొట్టేశారన్నది వాస్తవమని పేర్కొన్నారు. ఈ స్కీంలో చోటుచేసుకున్న అవినీతిని వెలికితీయాలన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణల్లో నిజనిజాలు బయటకు రావాలన్నా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఈ కేంద్ర పథకం అమలుపై విచారణ జరిపించాలన్నారు. ఇందుకు అమృత్ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ కోరుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ (సీవీసీ)కు లేఖ రాయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే దీనిపై విచారణ జరిపేందుకు సీవీసీని ఒప్పించేలా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా తాను వ్యక్తిగతంగా చొరవ చూపుతానని ఆయన ప్రకటనలో స్పష్టం చేశారు. తెలంగాణలో అమృత్ పథకం సక్రమంగా అమలవుతుందని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంట్రాక్టు కట్టబెట్టడంలో పక్షపాతం చూపలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే తక్షణమే సీవీసీకి లేఖ రాయాలన్నారు. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్టు భావించాల్సి వస్తుందని అన్నారు. 6 గ్యారంటీల అమలులో వైఫల్యం, హైడ్రా కూల్చివేతల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘అమృత్’ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.