Case Booked Against BRS Ex MLA Jeevan Reddy In Chevella : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన భూమిలో ఉన్న భవనాన్ని కూల్చివేసి మరో భవనాన్ని నిర్మించారని సామ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి గ్రామంలో సర్వే నంబర్ 32, 35, 36, 38లో 20 ఎకరాల 20 గుంటల భూమిని సామ దామోదర్ రెడ్డి కొనుగోలు చేసి అతని తండ్రి పరమ్ రెడ్డి పేరుపై ఫంక్షన్ హాల్ నిర్మించారు.
2023లో జీవన్ రెడ్డి, అతని అనుచరులు ఫంక్షన్ హాల్‌ను కూల్చేసి వేరే భవనాన్ని నిర్మించారని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం తమకి చెందిన భూమి దగ్గరికి వెళ్లగా మారణాయుధాలతో బెదిరించారని తెలిపారు. అక్రమంగా తమ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని దామోదర్ కోరారు. దీంతో జీవన్ రెడ్డి, అతని భార్య రజిత, తల్లి రాజు భాయి, సురేష్‌లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Jeevan Reddy Mall re Opened in Armoor : ఇటీవలే ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు చెల్లించనందుకు ఆర్మూర్ కేంద్రంలో ఉన్న ఆయన షాపింగ్ మాల్‌ను సీజ్ చేసి, నోటిసులు అంటించింది. అనంతరం మాల్లో ఉన్న వ్యాపార సముదాయాలను పోలీసులు మూసివేసి తాళాలు వేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం భవనాన్ని సంస్థ స్వాధీనం చేసుకుంది. ఆర్టీసీకి చెందిన 7059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(బీవోటీ) కింద 2013 జూన్ 1న లీజ్‌కు తీసుకుందని సజ్జనార్ తెలిపారు.
కాగా తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకున్న ఆర్మూర్ పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్‌ను ఆ సంస్థ అధికారులు నేడు ఓపెన్ చేశారు. ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ పాత బకాయిలు చెల్లించాలని వారం రోజులు గడువు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారం రోజుల్లో రూ. 2.52 కోట్లు చెల్లించని పక్షంలో జీవన్ రెడ్డి మాల్‌ను మళ్లీ తిరిగి ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకుంటుందని అధికారులు వెల్లడించారు.
జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ రీఓపెన్ - హైకోర్టు ఆదేశాలతో పాత బకాయిలకు వారం గడువు
సీఎంకు ధనసేకరణ మీద ఉన్న ధ్యాస ధాన్యం సేకరణపై లేదు : జీవన్‌రెడ్డి - Lok Sabha Election 2024