KTR Slams Congress Govt Over Musi River Project : రూ.1500 కోట్ల మూసీ ధనదాహానికి ఒకటి కాదు, రెండు కాదు లక్షల జీవితాలు బలవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరం రోధిస్తుంది - గుండెలు పగిలి, గూళ్లు చెదిరి ఆడబిడ్డల ఆవేదనలు, ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం రోధిస్తుందని ఆరోపించారు. రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరాలను నిర్మించి, దాన్ని కన్న బిడ్డలకు ఇవ్వలేకపోతున్నా అని ఒక తల్లి, అమ్మ లాంటి ఇల్లు వదిలి వేరే దిక్కు ఎలా పోతాం అంటూ మరో తండ్రి గుండెలు బాదుకుంటున్నారన్నారు.
ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమో అని ఆత్మహత్య చేసుకున్న తల్లి, భార్య కడుపుతో ఉంది కనికరించరా అని ఒంటిపై పెట్రోల్ పోసుకున్న భర్త ఇలా ఎన్నో కథలు ఉన్నాయన్నారు. నాడు రైతుల ప్రయోజనం కోసం 30 వేల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో 20 కార్లతో రైతులను రెచ్చగొడుతూ శవాలపై పేలాలు ఏరుకున్నారని విమర్శించారు. నాడు అలా, నేడు ఇలా, నీ అవసరానికి ఎంతటికైనా తెగిస్తావని మరోమారు నిరూపించావు అంటూ ముఖ్యమంత్రిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మహా నగర ప్రజలారా మీరు అధైర్య పడొద్దని, ఇప్పుడు జరుగుతున్న విధ్వంసంలో తొందరపడి మీ ప్రాణాలను బలితీసుకోవద్దని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ, న్యాయస్థానాలు మీకు మద్దతుగా ఉన్నాయంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఒకటా రెండా నగరం లో నీ 1,500,000,000,000 కోట్ల మూసి ధన దాహానికి బలవుతున్న జీవితాలు లక్షల్లో ఉన్నాయి మిస్టర్ చీప్ మినిష్టర్
— KTR (@KTRBRS) September 29, 2024
నగరం రోదిస్తుంది-గుండెలు పగిలి,గుళ్లు చెదిరి..ఆడబిడ్డల అవేధనలు..ఇంటి పెద్దల శాపనార్దాలతో నగరం రోదిస్తుంది
రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరాలను నిర్మించి కన్న… pic.twitter.com/sts2Oy91u2
మూసీ ప్రాంత ప్రజలను కలిసిన బీఆర్‌ఎస్ బృందం : మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఇవాళ పర్యటించింది. హైదర్ షాకోట, లంగర్‌హౌజ్ ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబిత, గంగుల, మల్లారెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల రాక దృష్ట్యా.. పోలీసులు భారీగా మోహరించారు. అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లకు సంబంధించిన స్థానికులతో బీఆర్ఎస్ నేతల బృందం సమావేశం అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలంటూ మంత్రి హరీశ్‌రావు సూచించారు. రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉంది. ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉందని హరీశ్‌రావు ఆరోపించారు. బాధితులకు అండగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉంటారని హరీశ్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ బాధితులకు అండగా ఉంటుందని తెలంగాణ భవన్ అందరికీ ప్రజాభవన్ అని అర్ధరాత్రి వచ్చినా అండగా ఉంటామని హరీశ్‌రావు భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మౌనం వీడి, ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం హైదర్షాకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం పర్యటన సందర్భంగా తెలంగాణ భవన్ నుంచి నేతలు బయలుదేరే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేతలను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, పోలీసులకు, గులాబీ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.